Sunday, April 28, 2024

రెండో వన్డేలో భారత మహిళల జట్టు ఘన విజయం

- Advertisement -
- Advertisement -

లక్నో: దక్షిణాఫ్రికాతో మంగళవారం జరిగిన రెండో వన్డేలో ఆతిథ్య భారత మహిళా క్రికెట్ జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ సిరీస్‌ను 11తో సమం చేసింది. మొదటి వన్డేలో సౌతాఫ్రికా విజయం సాధించిన విషయం తెలిసిందే. రెండో వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 41 ఓవర్లలో కేవలం 157 పరుగులకే కుప్పకూలింది. తర్వాత బ్యాటింగ్‌కు భారత మహిళా జట్టు 28.4 ఓవర్లలోనే కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఊరిస్తున్నలక్షంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన మిథాలీ సేనకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ జెమీమా రోడ్రిగ్స్ 9 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరింది. అప్పటికీ భారత్ స్కోరు 22 పరుగులు మాత్రమే. ఇస్మాయిల్ ఈ వికెట్‌ను పడగొట్టింది.
మంధాన మెరుపులు
ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను మరో ఓపెనర్ స్మృతి మంధాన తనపై వేసుకుంది. మంధానకు పూనమ్ రౌట్ అండగా నిలిచింది. ఇద్దరు సౌతాఫ్రికా బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. మంధాన తన మార్క్ షాట్లతో చెలరేగి పోగా రౌట్ మాత్రం సమన్వయంతో బ్యాటింగ్ చేసింది. ఈ జంటను విడగొట్టేందుకు ప్రత్యర్థి బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అద్భుత ఫామ్‌లో ఉన్న మంధాన ఈ మ్యాచ్‌లో కూడా అదే జోరును కొనసాగించింది. ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తిస్తూ స్కోరును పరిగెత్తించింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన మంధాన అలవోకగా అర్ధ సెంచరీ మార్క్‌ను చేరుకుంది. ఆ తర్వాత కూడా ధాటిగా ఆడుతూ జట్టుకు విజయం సాధించి పెట్టింది. చెలరేగి ఆడిన మంధాన 64 బంతుల్లోనే పది ఫోర్లు, మరో 3 సిక్సర్లతో అజేయంగా 80 పరుగులు చేసింది. మరోవైపు కీలక ఇన్నింగ్స్ ఆడిన పూనమ్ రౌట్ 89 బంతుల్లో 8 ఫోర్లతో 62 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. దీంతో భారత్ 28.4 ఓవర్లలోనే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది.
గోస్వామి మ్యాజిక్..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికాను భారత బౌలర్లు తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో సఫలమయ్యారు. ఆరంభంలో మాన్సి జోషి వెంటవెంటనే రెండు వికెట్లు తీసి సౌతాఫ్రికాను కష్టాల్లోకి నెట్టింది. ఆ తర్వాత వెటరన్ బౌలర్ జులన్ గోస్వామి అద్భుత బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్ పతనాన్ని శాసించింది. చెలరేగి బౌలింగ్ చేసిన గోస్వామి 42 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టింది. స్పిన్నర్ రాజేశ్వరి గైక్వాడ్ కూడా కీలకమైన మూడు వికెట్లు తీయడంతో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 157 పరుగుల వద్ద ముగిసింది. దక్షిణాఫ్రికా జట్టులో కెప్టెన్ సూనే లూస్ (36), లారా (49) మాత్రమే రాణించగా మిగతావారు విఫలమయ్యారు.

 IND Women’s Team win 2nd ODI against SA Women

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News