Monday, April 29, 2024

ఇరు జట్లకు కీలకం

- Advertisement -
- Advertisement -

అబుదాబి: ఐపిఎల్‌లో భాగంగా గురువారం జరిగే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తలపడుతుంది. ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ఇప్పటి వరకు మూడేసి మ్యాచ్‌లు ఆడిన పంజాబ్, ముంబై ఒక్క విజయం మాత్రమే సాధించాయి. దీంతో ఈ మ్యాచ్‌లో గెలిచి పైచేయి సాధించాలనే పట్టుదలతో కనిపిస్తున్నాయి. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ సూపర్ ఓవర్స్‌లో ఓటమి పాలైంది. మరోవైపు రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ అనూహ్య పరాజయం చవిచూసింది. ఈ మ్యాచ్‌లో 200 పైగా పరుగులు సాధించినా పంజాబ్ గెలుపు సాధించలేక పోయింది. కానీ, ముంబైతో జరిగే మ్యాచ్‌లో మాత్రం అలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని భావిస్తోంది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, లోకేశ్ రాహుల్‌లు ఇప్పటికే సెంచరీలతో సత్తా చాటారు. ఇద్దరు భీకర ఫామ్‌లో ఉండడం పంజాబ్‌కు కలిసి వచ్చే అంశం. వీరిలో ఏ ఒక్కరూ క్రీజులో నిలదొక్కుకున్న పంజాబ్‌కు భారీ స్కోరు నల్లేరుపై నడకే. మాక్స్‌వెల్, నికోలస్ పురాన్, కరున్ నాయర్, సర్ఫరాజ్ ఖాన్ వంటి మెరుగైన బ్యాట్స్‌మెన్ పంజాబ్‌కు అందుబాటులో ఉన్నారు.

అంతేగాక ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే షెల్డాన్ కాట్రెల్, మహ్మద్ షమి, మురుగున్ అశ్విన్ వంటి బౌలర్లు ఉండనే ఉన్నారు. అయితే రాజస్థాన్‌పై పంజాబ్ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకోవడం కాస్త ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు ముంబై కూడా గెలుపే లక్షంగా పోరుకు సిద్ధమైంది. కిందటి మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో ఓటమి పాలు కావడం ముంబై ఆత్మస్థైర్యాన్ని కాస్త దెబ్బతీసింది. బెంగళూరుపై ఇషాన్ కిషన్, కీరన్ పొలార్డ్ అసాధారణ పోరాట పటిమను కనబరిచారు. వీరిద్దరి అద్భుత బ్యాటింగ్ వల్ల ముంబై మ్యాచ్‌ను టైగా ముగించడంలో సఫలమైంది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, కిషన్, హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య తదితరులతో ముంబై బ్యాటింగ్ బలంగానే ఉంది. అయితే కీలక ఆటగాడు డికాక్ వరుస వైఫల్యాలు చవిచూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. బౌలింగ్‌లోనూ ముంబై బలంగానే కనిపిస్తోంది. కాగా ఇటు పంజాబ్, అటు ముంబైలో ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవలేదు. దీంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగడం ఖాయం.

IPL 2020: MI vs KXIP Match Tomorrow

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News