Monday, April 29, 2024

తొలి గెలుపు ఎవరిదో?

- Advertisement -
- Advertisement -

తొలి గెలుపు ఎవరిదో?
నేడు హైదరాబాద్‌తో కోల్‌కతా ఢీ

IPL 2020: SRH vs KKR Match Tomorrow

అబుదాబి: తొలి మ్యాచ్‌లో పరాజయం పాలైన కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు శనివారం జరిగే రెండో మ్యాచ్ కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచి ఐపిఎల్‌లో విజయాలకు శ్రీకారం చుట్టాలని రెండు జట్లు భావిస్తున్నాయి. ముంబై ఇండియన్స్ చేతిలో కోల్‌కతా, బెంగళూరు చేతిలో హైదరాబాద్ ఓటమి పాలయ్యాయి. హైదరాబాద్ చివరి వరకు పోరాడి ఓడగా కోల్‌కతా మాత్రం ఘోర పరాజయం పాలైంది. తొలి మ్యాచ్‌లో గెలిచే స్థితిలో ఉండి కూడా సన్‌రైజర్స్ చేజేతులా ఓటమి చవిచూసింది. బెంగళూరు గెలిచిందని చెప్పే కంటే హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ నిర్లక్షంగా ఆడి మ్యాచ్‌ను సమర్పించుకున్నారని చెప్పడమే సబబు. ఇక అబుదాబి వేదికగా జరిగే రెండో మ్యాచ్ ఇటు కోల్‌కతాకు, అటు హైదరాబాద్‌కు కీలకంగా మారింది. ఇందులో గెలవడం ద్వారా మళ్లీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలని ఇరు జట్ల క్రికెటర్లు భావిస్తున్నారు. ముంబైపై కోల్‌కతా రెండు విభాగాల్లోనూ విఫలమైంది. బౌలర్లు విఫలం కావడంతో ముంబై భారీ స్కోరును నమోదు చేసింది. ఇక బ్యాటింగ్‌లో కూడా కోల్‌కతా తేలి పోయింది. కీలక ఆటగాళ్లందరూ తమ స్థాయికి తగ్గ ఆటను కనబరచడంలో విఫలమయ్యారు. యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ పూర్తిగా నిరాశ పరిచాడు. కెప్టెన్ దినేశ్ కార్తీక్, స్టార్ ఆటగాడు ఆండ్రూ రసెల్ తొలి మ్యాచ్‌లో సత్తా చాటలేక పోయారు. అంతేగాక సునీల్ నరైన్, నితీష్ రానా కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. దీంతో కోల్‌కతాకు భారీ ఓటమి తప్పలేదు. ఈసారి మాత్రం ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఆడాలనే పట్టుదలతో కోల్‌కతా బ్యాట్స్‌మెన్ ఉన్నారు. ఈ మ్యాచ్‌లోనైన శుభ్‌మన్ గిల్ తన బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరం ఎంతైన ఉంది. రసెల్, నరైన్, రానా, ఉతప్ప తదితరులు విజృంభిస్తే భారీ స్కోరు సాధించడం నైట్‌రైడర్స్‌కు కష్టమేమీ కాదు. ఇక పాట్ కమిన్స్ రూపంలో అగ్రశ్రేణి బౌలర్ ఉండనే ఉన్నాడు. కుల్దీప్ కూడా రాణిస్తే బౌలింగ్ కష్టాలు తీరడం ఖాయం.
వార్నర్‌పైనే ఆశలు
ఇక హైదరాబాద్ గెలుపే లక్షంగా మ్యాచ్‌కు సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో విఫలమైన కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఈసారి బ్యాట్‌ను ఝులిపించాలనే పట్టుదలతో ఉన్నాడు. వార్నర్ చెలరేగితే హైదరాబాద్ బ్యాటింగ్ కష్టాలు చాలా వరకు తీరి పోతాయి. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన వార్నర్‌పైనే జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఇక మరో ఓపెనర్ జానీ బైర్‌స్టో ఫామ్‌లో ఉండడం జట్టుకు కలిసి వచ్చే అంశం. ఈ మ్యాచ్‌లో కూడా బైర్‌స్టో మెరుపులు మెరిపించాలనే పట్టుదలతో ఉన్నాడు. మనీష్ పాండే కూడా తన స్థాయికి తగ్గ ఆటను కనబరచాల్సి ఉంది. తొలి మ్యాచ్‌లో మనీష్ బాగానే ఆడినా భారీ స్కోరు మాత్రం సాధించలేక పోయాడు. ఈసారి మరింత మెరుగైన ఆటను కనబరచాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇక విజయ్ శంకర్ తొలి మ్యాచ్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. ఈసారైన రాణిస్తాడా లేదా అంతుబట్టడం లేదు. బౌలింగ్‌లో మాత్రం హైదరాబాద్ బాగానే ఉంది. తొలి మ్యాచ్‌లో బౌలర్లు పర్వాలేదనిపించారు. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే లక్షంతో కనిపిస్తున్నారు. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉండడంతో మ్యాచ్ ఆసక్తికరగా సాగడం ఖాయం.

IPL 2020: SRH vs KKR Match Tomorrow

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News