Sunday, April 28, 2024

సుదీర్ఘ యుద్ధానికి సిద్ధం కావాలి

- Advertisement -
- Advertisement -

Lockdown

 

కరోనా అంటు క్రిమిని అంతమొందించడం, దానిని పూర్తిగా పారద్రోలడం తొందరలో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. 200లకు పైగా దేశాలకు పాకిన ఈ వైరస్ ప్రపంచ వ్యాప్తంగానూ మన దేశంలో కూడా పెరుగుతూనే ఉన్నది. సోకిన అన్ని దేశాల్లోనూ కలిపి ఇంత వరకు 13,52,173 కేసులు బయటపడ్డాయి. 75,294 మంది చనిపోయారు. భారతదేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 4,421కి పెరిగింది, 117 మంది చనిపోయారు. వ్యాధి తీవ్రత పెరగడంతో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌ను ఐసియు (ఇంటెన్సివ్ కేర్ యూనిట్) లో చేర్చి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. దేశ పాలనా బాధ్యతలను మంత్రివర్గంలోని మరొకరికి అప్పగించక తప్పలేదు. అమెరికాలో వైరస్ అతి వేగంగా విస్తరిస్తున్నది. అక్కడ కరోనా కేసులు మంగళవారం నాటికి 3,68,289కి చేరుకున్నాయి, మృతుల సంఖ్య 10,989. మందులేని ఈ వైరస్ నుంచి కాపాడుకోడానికి భౌతిక దూరాన్ని పాటించడమే సరైన మందని స్పష్టమైంది.

వీధుల్లో గుంపులుగా చేరకుండా, కిక్కిరిసినట్టు ఉండకుండా కఠినమైన స్వీయ గృహ నిర్బంధాన్ని, ఇళ్లకే పరిమితం కావడాన్ని ఆశ్రయించడమే మార్గమని రూఢి అయిపోయింది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన 3 వారాల లాక్‌డౌన్ గడువు ఈ నెల 14తో ముగుస్తుంది. లాక్‌డౌన్ చాలా మందికి ముఖ్యంగా రోజువారీ ఆదాయం మీద ఆధారపడి బతికేవారికి, పేదలకు ఇబ్బందిగానే ఉంటుంది. కాని వైరస్ వ్యాప్తి వేగం పెరిగేందుకు ఏమాత్రం సందిచ్చినా చైనా, ఇటలీ, స్పెయిన్, అమెరికాల్లో మాదిరిగా వేలాది ప్రాణాలు బలి ఇచ్చుకోవలసి వస్తుంది. ప్రజల ప్రాణాలను కాపాడడమా, ఆర్థిక వ్యవస్థను రక్షించుకోడానికి లాక్‌డౌన్ ఎత్తివేయడమా అనే మీమాంస తలెత్తింది. ఇందులో మొదటి దానికే ప్రాధాన్యం ఇవ్వడం మానవతా దృక్పథం అవుతుంది. రెండోదాన్ని ఎప్పుడైనా, ఎలాగైనా సరిదిద్దుకోవచ్చు.

కాని పోయిన ప్రాణాలు రావు. అందుకే లాక్‌డౌన్‌ను మరి ఒకటి, రెండు వారాలు పెంచడమే మంచిదని ముఖ్యమంత్రి కెసిఆర్ సూచించినదే విజ్ఞతాయుతమైన పద్ధతి. ఈ విషయం ఆయన ప్రధాని మోడీకి కూడా సూచించారు. అందుచేత అందరమూ మరి కొంత కాలం పాటు లాక్‌డౌన్‌ను పాటించడానికి మానసికంగా సంసిద్ధులం కావాలి. రాష్ట్రంలో పరిస్థితిని ముఖ్యమంత్రి కెసిఆర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రజలతో నేరుగా మాట్లాడుతున్నారు. సిబ్బందిని నిరంతరం అప్రమత్తతలో ఉంచుతున్నారు. ఇటువంటి అపూర్వమైన అత్యవసర పరిస్థితి వస్తే చేతనైనతనం, చాకచక్యం గల నాయకులు ఏ విధంగా ఉంటారో అన్న దానికి కెసిఆర్ ఒక తిరుగులేని ఉదాహరణగా నిలిచిపోతారు. దేశంలో ఉత్పత్తి అవుతున్న మలేరియా మందు హైడ్రోక్లోరో క్విన్ కోసం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రధాని మోడీని కోరిన సంగతి తెలిసిందే. తాను తన దేశ ప్రజల అవసరానికి ప్రాధాన్యం ఇవ్వక తప్పదని మోడీ ట్రంప్‌తో అన్నట్టు వార్తలు వచ్చాయి.

కాని అడిగిన వారికి అవసరంలో ఉన్నవారికి ఔషధాన్ని అందించడమే సరైన పని అని భావించిన ప్రధాని మోడీ ఈ మందు ఎగుమతిపై గల నిషేధాన్ని పాక్షికంగా సడలించి పెండింగ్‌లో ఉన్న అమెరికన్ కంపెనీల ఆర్డర్ల మేరకు క్లోరోక్విన్‌ను ఉత్పిత్తి చేసి పంపించడానికి నిర్ణయించారు. అదే సమయంలో మన పొరుగు దేశాలకు కూడా ఈ మందును ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. క్లోరోక్విన్‌ను కరోనా రోగులకు చికిత్స చేస్తున్న వైద్య సిబ్బందికి ఇస్తారు. దీనిని తీసుకునేవారికి కరోనా వైరస్ సోకదని నమ్ముతున్నారు. ఇది మంచి గుణాన్ని ఇస్తున్నట్టు ట్రంప్ స్వయంగా అంగీకరించాడు. అమెరికాకు కూడా ఈ మందును మన దేశం నుంచే సరఫరా చేస్తున్నారు. అయితే గత నెలలో దీని ఎగుమతిపై మన ప్రభుత్వం నిషేధం విధించింది. దేశంలోని అవసరం రీత్యా ఈ నిర్ణయాన్ని తీసుకున్నది.

ట్రంప్ మొన్న ఆదివారం నాడు ప్రధాని మోడీతో ఫోన్‌లో మాట్లాడి తమ కంపెనీల ఆర్డర్ల మేరకు క్లోరోక్విన్‌ను ఉత్పత్తి చేసి పంపించాలని కోరడం ఒక ఎత్తైతే, ఒక వేళ అందుకు నిరాకరిస్తే వాణిజ్యపరమైన ప్రతీకార చర్యలు తీసుకుంటామని అది న్యాయమే కదానని ప్రధాని మోడీని సుతిమెత్తగా హెచ్చరించినట్టు కూడా వార్తలు వచ్చాయి. ఒక్క క్లోరోక్విన్‌నే కాకుండా పారాసిటామల్ మాత్రలను కూడా అమెరికాతో పాటు మన పొరుగు దేశాలకు సరఫరా చేయాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అవసరంలో ఉన్న శత్రువుకైనా అడిగినది ఇవ్వడం ఆసన్నహస్తం చాచడం భారతీయ సంప్రదాయం.

ట్రంప్ హెచ్చరికలకు తలవొగ్గి కాక మానవతా దృక్పథంతోనే ప్రధాని మోడీ ఈ మాత్రల ఎగుమతులపై ఆంక్షలు సడలించినట్టు భావించాలి. మనతో వాణిజ్యంలో గల లోటును తొలగించుకోడానికి అమెరికా మనపై ఆంక్షల కొరడా ఝళిపించడం కొత్త కాదు, వింత కాదు. కాని ప్రపంచ విపత్తుగా పరిణమించిన కరోనా నేపథ్యంలో భారత వైఖరి మానవీయంగానే ఉంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ విషయంలో ప్రధాని మోడీ అందుకు అనుగుణంగానే వ్యవహరించారు. లాక్‌డౌన్ వల్ల బొత్తిగా ఆదాయం లేక ఇల్లు గడవడం కష్టమవుతున్న పేదలను, వలస కార్మికులను ఆదుకోవలసిన తప్పనిసరి బాధ్యతను ప్రభుత్వాలు, సమాజం గుర్తించి దానిని నెరవేర్చాలి.

 

It is better to increase the Lockdown
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News