Monday, April 29, 2024

స్థానికులకే కొలువులు

- Advertisement -
- Advertisement -

ఫార్మాసిటికి భూమి ఇస్తున్న కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం
వెంటనే ప్రభావిత కుటుంబాల జాబితా తయారు చేయాలి
వారి విద్యార్హతలు, ఇతర టెక్నికల్ అర్హతలపై మ్యాపింగ్ చేయండి
అవసరమైతే శిక్షణ ఇచ్చేందుకు ఫార్మా సిటీ పరిసర మండలాల్లో రెండు ట్రైనింగ్ కేంద్రాల ఏర్పాటు
ప్రగతిభవన్‌లో ఫార్మాసిటి పనులపై మంత్రి కెటిఆర్ సమీక్ష
హాజరైన మంత్రి సబితా ఇంద్రారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు

KTR Review Meeting on Pharma City Work Progress

 

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ గా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ ఫార్మాసిటిలో స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కె. తారకరామారావు అన్నారు. ఫార్మాసిటి కోసం భూమి ఇస్తున్న కుటుంబాల్లో కనీసం ఒకరికి ఉద్యోగాలు ఇచ్చే అంశాన్ని వెంటనే పరిశీలించాలన్నారు. ఆ దిశగా ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాలని అధికారులను మంత్రి కెటిఆర్ ఆదేశించారు. ఈ మేరకు ఫార్మాసిటిలో ప్రభావిత కుటుంబాల జాబితా ఒకటి తయారు చేసి వారి ఇళ్లలో ఉన్న కుటుంబ సభ్యుల విద్యార్హతలు మరియు ఇతర టెక్నికల్ అర్హతలను మ్యాపింగ్ చేయాలన్నారు. వీరికి శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ మరియు ఇతర శిక్షణా సంస్థల సహకారంతో ముందుకు పోవాలని సూచించారు. రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే నిబంధనలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుచ్చిందన్నారు. ఈ మేరకు ఒక పాలసీ విధానానికి ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం కూడా తెలిపిందని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ప్రగతి భవన్‌లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, స్థానిక శాసనసభ్యుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో కలిసి ఫార్మాసిటి పనుల ప్రగతిపై మంత్రి కెటిఆర్ సమీక్ష చేశారు. పనుల్లో ఎలాంటి కాలయాపన జరగకుండా చూడాలన్నారు. ఫార్మాసిటితో పరిసర ప్రాంతాలు మరింతగా అభివృద్ధి చెందనున్నాయన్నారు.

ఈ నేపథ్యంలో వారికి మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూనే ఫార్మాసిటి పనులు శరవేగంగా పూర్తి చేయాలన్నారు. కాగా స్థానికుల సహకారంతో ఫార్మాసిటి పనులు ఎంతో వేగంగా ముందుకు వెళ్తున్నాయని సంబంధిత అధికారులు మంత్రులకు తెలియజేశారు. అనంతరం వారిని ఉద్దేశించి మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, స్థానికుల ప్రయోజనాలకు పెద్ద పీట వేసెలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వారికి తగు శిక్షణ ఇచ్చేందుకు ఫార్మా సిటీ పరిసర మండలాల్లో 2 శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ శిక్షణ కేంద్రాల ద్వారా ఫార్మాసిటీలో పెట్టుబడులు పెట్టనున్న ఫార్మా కంపెనీల భాగస్వామ్యంతో వారికి కావలసిన ఉద్యోగ అర్హతలు, అవసరాల మేరకు శిక్షణ కార్యక్రమాలు రూపొందించడం పైన దృష్టి సారించాలన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించే కంపెనీలకు, పెట్టుబడిదారులకు ప్రత్యేక ప్రోత్సాహం ఇచ్చే చర్యలు తీసుకున్నాదని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ గుర్తు చేశారు. ఈ సమీక్ష సమావేశంలో ఫార్మాసిటీ కార్యక్రమాలను మంత్రి సమీక్షించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తోపాటు టి ఎస్ ఐ ఎస్ సి ఎండి వెంకటనర్సింహారెడ్డి,రంగారెడ్డి మేడ్చల్ జిల్లా కలెక్టర్ లతోపాటు పరిశ్రమల శాఖ కమిషనర్ తదితర ముఖ్య అధికారులు పాల్గొన్నారు.

KTR Review Meeting on Pharma City Work Progress

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News