Monday, April 29, 2024

ఇక నుంచి తెలుగులో చట్టాలు

- Advertisement -
- Advertisement -

Laws in Telugu from now on

సిఎం కెసిఆర్ వినూత్న నిర్ణయం
వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం

మనతెలంగాణ/హైదరాబాద్ : ఇక నుంచి తెలుగులో చట్టాలు ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రజలకు అర్థమయ్యే భాషలో చట్టాలుండేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఆంగ్లంలో ఉన్న చట్టాలను తెలుగులో ఉండేలా రూపొందించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. పాలనా నిబంధనలు, ఇతర అంశాలు, చట్టాలు, మాన్యువల్స్ నిబంధనావళి, సర్వీస్‌రూల్స్ వంటివి ఉద్యోగులకు ప్రజలకు అర్ధమయ్యేలా ఉండాలని సిఎం కెసిఆర్ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. చట్టాలను ఇకపై తెలుగులో కూడా అనువదించాలని కొత్త చట్టాలు పూర్తిగా తెలుగులో సంపూర్ణ ఉప శీర్షికలతో ముద్రించాలని కూడా సిఎం కెసిఆర్ ఆదేశించారు. ఇక నుంచి ప్రతి ఆర్డర్, సర్కులర్ తెలుగు, ఇంగ్లీష్‌లో విడుదల చేయాలని సిఎం ఆదేశించిడంతో ఆ దిశగా అధికారులు కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ప్రభుత్వ సమాచారం సులువుగా, సౌలభ్యంగా ఉండేలలా అధికారులు చర్యలు చేపట్టారు. గతంలో ఉన్న పాత చట్టాలను తెలుగు, ఉర్ధూలో అనువదించేందుకు కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్, ఆయాచితం శ్రీధర్‌లు కృషి చేశారు. వారి నేతృత్వంలోని బృందం గతంలో ఇంగ్లీష్‌లో మాత్రమే ఉన్న అనేక చట్టాలను తెలుగులో రూపొందించేందుకు కొంత కసరత్తు చేసింది.

కొన్ని ప్రభుత్వ శాఖల్లో మరికొంత సమయం

గతంలో హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా ప్రభుత్వం తెలుగును ప్రజలకు మరింత చేరువ చేసేందుకు, ప్రజలకు సరళంగా అర్థమయ్యేలా పాలనా చట్టాలు చేసి తీరాలనే పట్టుదల కనబరిచింది. ఈ తరుణంలో పరిపాలనకు గుండెకాయ వంటి సచివాలయం లోని నిబంధనలను, ప్రభుత్వ పరిపాలనా నిబంధనావళిని తెలుగులోకి తర్జుమా చేశారు. వీటిని ప్రభుత్వ వెబ్‌సైట్లు ఆయా శాఖల అధికారిక వెబ్‌పేజీల్లో అప్‌లోడ్ చేయాలని యోచిస్తోంది. ఈ ప్రయత్నాల్లో ప్రభుత్వం ఆశించిన మేర సఫలమయినప్పటికీ కొన్ని ప్రభుత్వ శాఖలకు మరికొంత సమయం పట్టే అవకాశాలున్నాయని, తర్జుమాకు సాంకేతికకంగా కొన్ని సమస్యలు ఎదురుకావడంతో జాప్యం నెలకొందని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన చట్టాలను తెలుగులోకి జారీ చేయాలని ప్రభుత్వం లక్షం పెట్టుకున్నప్పటికీ సిబ్బంది కొరత ప్రస్తుతం వెంటనే ఇది అమల్లోకి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.

ఉమ్మడి రాష్ట్రంలో విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ డాక్టర్ టి.రాధ తెలుగులో కరువు మండలాల జీఓను జారీ చేశారు. ఆ తరువాత ఈ శాఖ నుంచి అనేక తెలుగు జిఓలు జారీ అయ్యాయి. దీనిని స్ఫూర్తిగా తీసుకున్న కొన్ని శాఖలు ఆ దిశలో ప్రయత్నాలు చేశాయి. తాజాగా నూతన పంచాయతీ రాజ్ చట్టం, పురపాలక చట్టాలు ప్రజలకు అర్థమయ్యే సరళమైన తెలుగు పదాలతో ప్రజల ముందుంచారు. ఈ కార్యాచరణ తెలంగాణలో ప్రజా పాలన కీలక ముందడుగుగా అభివర్ణించొచ్చని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

డాష్‌బోర్డు ప్రారంభించాలని సిఎస్ నిర్ణయం

నూతన సచివాలయ నిర్మాణ యోచనకు ముందు రాష్ట్రంలో పరిపాలన అంతా డిజిటల్ రూపంలో జరిపించేలా సిఎం కెసిఆర్ ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ అధికారిక పాలన అంతా ఎలక్ట్రానిక్ డిజిటలైజ్ చేసేందుకు అప్పట్లో టిఎస్‌టిఎస్ కార్యాచరణ చేసింది. ఏ మూలన ఏం జరుగుతుందో ప్రత్యక్షంగా పర్యవేక్షించేలా రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలను కమాండ్ కంట్రోల్ ద్వారా డిజిటల్ రూపంలో కేంద్రీకృతం చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సిఎం అధికారిక నివాసమైన ప్రగతిభవన్ సహా పోలీస్ కమాండ్ కంట్రోల్ సిస్టం ద్వారా అన్ని జిల్లాల కార్యాలయాల్లో డిజిటల్ కాన్ఫరెన్సింగ్ సౌకర్యాలను సమకూర్చనున్నారు. ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ సౌలభ్యాన్ని మరింత ఆధునీకరించే కసరత్తు జరుగుతోంది. వీడియో కాలింగ్ సౌకర్యానికి శాటిలైట్ నెట్‌వర్క్ వినియోగంతో పాటు దస్త్రాల్ ట్రాకింగ్ సిస్టంను కూడా ఆధునీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రతి ఫైల్‌ను బార్‌కోడింగ్ చేసి దాని స్థితిగతులను ఎప్పటికప్పుడు పరిశీలించడం ద్వారా పెండింగ్‌లను నివారించి పారదర్శకత పెంచే చర్యలను చేపడుతోంది. ఇక ప్రభుత్వ సమాచారం, శాఖల్లోని కీలక అంశాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసేలా సాంకేతికతతో ఆయా విషయాలతో డాష్‌బోర్డును ప్రారంభించాలని సిఎస్ నిర్ణయం తీసుకున్నారు. తద్వారా సమాచార సేకరణ సులువుగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. జిల్లా కలెక్టరేట్లలో డిడిఆర్‌సి సమావేశాలు ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్ తీరుతెన్నులను నేరుగా ప్రభుత్వం వీక్షించనుంది. నీటి ప్రాజెక్టుల నిర్మాణాల పురోగతి, విపత్తుల సమయంలో ప్రభుత్వ పథకాల అమలు పర్యవేక్షణ అంతా వీడియో రూపంలో నేరుగా వీక్షించే వెసులుబాటు అందుబాటులోకి ప్రభుత్వం తీసుకురానుంది. దీంతో పాలనలో జాప్యం, నిర్లక్షం ఉండదని ప్రభుత్వం భావిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News