Monday, April 29, 2024

‘దడ’ పుట్టిస్తున్న సాగర్ ఉప ఎన్నిక

- Advertisement -
- Advertisement -

పరువు కోసం ప్రధాన పార్టీల పాకులాట

 

మన తెలంగాణ/హైదరాబాద్ : నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ‘దడ’ పుట్టిస్తోంది. ప్రధాన పార్టీలను పరువు కోసం పరుగులు పెట్టిస్తోంది. గెలిస్తే ఊపిరి పీల్చుకోగలం. అదే ఓటమి పాలైతే ఎదురయ్యే పరిణామాలేమిటన్న ప్రశ్న అధికార, ప్రతిపక్షాలను కలవరపాటుకు గురిచేస్తోంది. ఎందుకొచ్చిన ఎన్నిక బాబోయ్ అంటూ బెంగపెట్టుకుంటున్నాయి. గెలుపుమీద ఏ పార్టీకి స్పష్టమైన నమ్మకం లేకపోవడమే దీనికి కారణంగా చెబుతున్నారు. తానూ ఉన్నానంటూ తాజాగా సవాల్ విసురుతున్న బిజెపికి సైతం ముచ్చెమటలు పడుతున్నాయి. ఇటీవల తెలంగాణలో సాధించిన విజయాలన్నీ సాగ ర్‌లో కలిసి పోతాయోమోనన్నది ఆ పార్టీ భయం. గతేడాది డిసెంబర్ 1వ తేదీన నాగార్జునసాగర్ ఎంఎల్‌ఎ నోముల నర్సింహయ్య మరణించారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సిన అనివార్య పరిస్థితి ఉత్పన్నమైంది.

నోముల నర్సింహయ్య మృతితో ఖాళీ అయిన నాగార్జునసాగర్ అధికార పార్టీ సిట్టింగ్ స్థానం. ఈ ఉప ఎన్నిక మూడు రాజకీయ పార్టీలకు కీలకం. ఈ స్థానం నుండి మాజీ మంత్రి, కాంగ్రెస్ సీని యర్ నేత జానారెడ్డిని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపనుంది. చలకుర్తి, నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానాల నుండి(నియోజకవర్గాల పునర్విభజనలో చలకుర్తి అసెంబ్లీ స్థానం నాగార్జునసాగర్‌గా మారింది) ఏడు దఫాలు విజయం సాదించారు. రెండు దఫాలు ఈ స్థానం నుండి జానారెడ్డి ఓటమి పాలయ్యారు. నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం నుండి 2018లో జరిగిన ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్యకు 46.3 శాతం ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి 42 శాతం ఓట్లు దక్కాయి. బిజెపి అభ్యర్థి కె.నివేదితరెడ్డికి 1.4 శాతం ఓట్లు దక్కాయి. సిపిఎంకు రాజీనామా చేసి టిఆర్‌ఎస్‌లో చేరిన నోముల నర్సింహయ్య 2014 ఎన్నికల్లో పోటీ చేశారు. ఇదిలా ఉండగా, 2018 నాటి ఏకపక్ష రాజకీయ సానుకూలత ప్రస్తుతం టిఆర్‌ఎస్‌కు లేదు. తెలంగాణ ప్రజలు సెంటిమెంట్‌కు ప్రాధాన్యం ఇచ్చేలా కనిపించడం లేదు. దుబ్బాకలో కుటుంబ సెంటిమెంట్‌ను ప్రయోగిస్తే దారుణ ఫలితాన్ని చవిచూడాల్సి వచ్చింది.

ఇప్పుడు కూడా నోముల నర్సింహయ్య కుటుంబసభ్యులను పోటీకి పెడితే పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. నియోజకవర్గంలో ప్రాబల్య రాజకీయ సామాజిక వర్గమైన రెడ్డి వర్గీయులు సహకరించరేమోనన్న సందేహాలు ఉన్నాయి. అదే సమయంలో నర్సింహయ్య కుటుంబానికి అన్యాయం చేస్తే యాదవ సామాజిక వర్గం దెబ్బతీస్తుందేమోననే అనుమానాలు నెలకొంటున్నాయి. దీంతో అభ్యర్థి ఎంపిక మొదలు విజయతీరాలు చేరే వరకూ టిఆర్‌ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కమలం పార్టీకి కూడా ఈ ఎన్నికలు షాక్‌లాగానే కనిపిస్తున్నాయి. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక దుబ్బాక, జిహెచ్‌ఎంసి తరహాలో ఉండదని కమలనాథులకు తెలియంది కాదు. దీంతో జానారెడ్డిని తమ పార్టీలోకి తీసుకుని అడ్డదారిలో రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలని చూసింది.

కానీ క్షేత్రస్థాయిలో బిజెపికి సానుకూల పరిస్థితులు లేవని గ్రహించిన జానారెడ్డి ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. దాంతో బిజెపికి మొదటి దెబ్బ పడింది. పోటీ కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల మధ్య కేంద్రీకృతమైతే భారీగా నష్టపోయేది బిజెపినే. ప్రస్తుతం జరగబోయే ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో అత్యంత కీలకమైనది. ఏ మాత్రం బెడిసికొట్టినా కాంగ్రెస్ ఉనికిని సైతం కోల్పోయే పరిస్థితి దాపురించనుంది. ఈ విధంగా అధికార పార్టీతో సహా ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బిజెపిలకు నాగార్జునసాగర్ ఉప ఎన్నిక రూపేణా ఓ పెద్ద ఉపద్రవం వచ్చి పడినట్లయిందని విశ్లేషకులు అంటున్నారు. మొత్తమ్మీద సాగర్ అన్ని పార్టీలకు ఒక రాజకీయ సమస్యగా మారిందనడంలో సందేహం లేదు. అన్ని పార్టీలకు ఈ ఉప ఎన్నిక చావో, రేవో కావడం గమనార్హం. ఇక అధికార పార్టీతో సహా ప్రధాన పార్టీలు సర్వేల మీద సర్వేలు జరుపుతున్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News