Monday, April 29, 2024

టీమిండియాకు కొత్త ఫిట్‌నెస్ విధానం!

- Advertisement -
- Advertisement -

New fitness policy for Team India

 

యోయోతో పాటు మరో కొత్త నిబంధన 
ఇందులో నెగ్గితేనే జట్టులో చోటు 
ఇంగ్లండ్ సిరీస్‌తోనే దీనికి శ్రీకారం

ముంబై : ప్రస్తుతం అన్ని క్రీడల్లో కూడా ఫిట్‌నెస్ కీలకంగా మారిన విషయం తెలిసిందే. క్రికెట్‌తో సహా ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్, బ్యాడ్మింటన్, రగ్బీలతో అథ్లెటిక్స్‌లో ఫిట్‌నెస్ నిరూపించుకుంటేనే జట్టుకు ప్రాతినిథ్యం వహించే అవకాశం ఉంటుంది. ఇటీవల కాలంలో క్రికెట్‌లో కూడా ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత పెరిగింది. ఆస్ట్రేలియాతో జరిగిన సుదీర్ఘ సిరీస్‌లో టీమిండియా ఫిట్‌నెస్ సమస్యను ఎదుర్కొంది. చాలా మంది క్రికెటర్లు పూర్తి స్థాయి ఫిట్‌నెస్‌తో లేకుండానే ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లారు. దీంతో పలువురు క్రికెటర్లు సిరీస్ మధ్యలోనే ఇంటిదారి పట్టాల్సి వచ్చింది. కొంతమంది గాయాలతో వైదొలగాల్సి వచ్చినా చాలా వరకు ఫిట్‌నెస్ సమస్య కూడా క్రికెటర్లను వెంటాడింది. ఈ నేపథ్యంలో ఇకపై జరిగే క్రికెట్ సిరీస్‌లలో ఆటగాళ్ల ఫిట్‌నెస్ ప్రమాణాలను మరింత పెంచాలని భారత క్రికెట్ బోర్డు నిర్ణయించింది. ఇందులో భాగంగానే సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా అందరికీ ఫిట్‌నెస్ టెస్టులు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

అంతర్జాతీయ క్రికెట్‌లో పెరుగుతున్న ఫిట్‌నెస్ ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేపట్టాలనే ఉద్దేశంతో బిసిసిఐ ఉంది. ఇందుకుగాను సమూల మార్పులకు శ్రీకారం చుట్టనుంది. క్రికెటర్ల దేహదారుడ్యం, వేగాన్ని కొలిచేందుకు రెండు కిలోమీటర్ల టైమ్ ట్రయల్స్ నిర్వహించాలని బిసిసిఐ నిర్ణయించింది. కాంట్రాక్టు ఆటగాళ్లతో పాటు టీమిండియాలో చోటు ఆశిస్తున్న క్రికెటర్లు ఇకపై యోయో టెస్టుతో పాటు టైమ్ ట్రయల్స్‌లో నెగ్గాల్సి ఉంటుంది. ఇందులో గెలిస్తేనే క్రికెటర్లను జట్టుకు ఎంపిక చేస్తారు. ఒకవేళ ఇందులో విఫలమైతే జట్టులో చోటు సంపాదించడం కష్టమే. టైమ్ ట్రయల్స్ నిబంధన క్రికెటర్ల ఫిట్‌నెస్ సామర్థాన్ని మరింత పెంచుతుందనే నమ్మకంతో బిసిసిఐ ఉంది. ఇటీవల కాలంలో ఏర్పడిన ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఎంతో ఉందని బోర్డుకు చెందిన ఒక అధికారి పేర్కొన్నాడు.

దీంతో రానున్న ఇంగ్లండ్ సిరీస్‌ను దృష్టిలో పెట్టుకుని టీమిండియా క్రికెటర్లకు కొత్త ఫిట్‌నెస్ విధానాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో బిసిసిఐ కసరత్తులు ప్రారంభించింది. యోయోతో పాటు టైమ్ ట్రయల్స్ నిబంధనలను కొత్తగా ప్రవేశ పెట్టాలని బోర్డు నిర్ణయించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రస్తుతం ఫిట్‌నెస్ చాలా కీలకంగా మారిందని, ముఖ్యంగా సుదీర్ఘ కాలంపాటు సాగే సిరీస్‌లలో దీని ప్రాధాన్యత మరింతఅధికంగా ఉంటుందని బోర్డు భావిస్తోంది. ఇదిలావుంటే కొత్త ప్రమాణాల ప్రకారం ఫాస్ట్ బౌలర్లు 2 కిలో మీటర్ల దూరాన్ని 8.15 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. అదే వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ అయితే 8.30 నిమిషాల్లో ఈ దూరాన్ని చేరుకోవాలి. ఇక యోయో స్థాయి ఎప్పటిలాగే 17.1గా ఉండనుంది. మరోవైపు కొత్త నిబంధనల అమలు గురించి ఆస్ట్రేలియా పర్యటనలో క్రికెటర్లకు బోర్డు వివరించింది. దీనికి చాలా మంది సీనియర్, జూనియర్ క్రికెటర్లు అంగీకరించారు. దీంతో ఇంగ్లండ్ సిరీస్ ఆరంభానికి ముందు ఈ కొత్త ఫిట్‌నెస్ విధానాలకు శ్రీకారం చుట్టనున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News