Monday, April 29, 2024

సీనియర్ పాత్రికేయులు పసుపులేటి రామారావు కన్నుమూత

- Advertisement -
- Advertisement -

chiranjeevi

 

సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు(70) మంగళవారం మృతిచెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూశారు. పసుపులేటి రామారావు మృతిచెందిన విషయం తెలియగానే మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్ ఇందిరానగర్‌లోని ఆయన స్వగృహానికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ “ పసుపులేటి రామారావు నాకు ఆత్మబంధువు. సీనియర్ జర్నలిస్టు అనే కాకుండా ఆయన వ్యక్తిత్వం నాకెంతో ఇష్టం.

నేనంటే అతనికి ఎంతో అభిమానం, అతనన్నా నాకంతే అభిమానం. లేకలేక పుట్టిన అతని కుమారుడికి మా ముగ్గురు అన్నదమ్ముల పేర్లు కలిసి వచ్చేలా పేరు పెట్టారు. ఆ కుర్రాడి పేరు కళ్యాణ్ నాగ చిరంజీవి. నేనతన్ని కేవలం ఒక జర్నలిస్టుగానే చూడను. నీతికీ నిజాయితీకీ నిబద్దతకూ మరో రూపంలా చూస్తుంటాను. అతని కుటుంబానికి నేను అన్నిరకాలుగా అండగా ఉంటాను. పసుపులేటి రామారావు ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను” అని పేర్కొన్నారు.

సినీ ప్రముఖుల సంతాపం…
పసుపులేటి రామారావు మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేశారు. స్టార్ హీరో, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ మాట్లాడుతూ “పసుపులేటి రామారావు కన్నుమూశారనే వార్త నన్ను బాధకు గురిచేసింది. వ్యక్తిగతంగా వారితో నా చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. వామపక్ష భావాలు కలిగిన పసుపులేటి మృధు స్వభావి. తెలుగు సినిమాపై పలు రచనలు చేసి సినీ చరిత్రకు అక్షర రూపమీయడంలో ఆయన తన వంతు పాత్ర పోషించారు”అని అన్నారు. సీనియర్ నటుడు, నిర్మాత ఎం.మోహన్‌బాబు మాట్లాడుతూ “పసుపులేటి రామారావు మరణం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. నేను నటుడిగా పరిచయమైనప్పటి నుండి ఆయనతో నాకు స్నేహం ఉంది. సినిమా జర్నలిస్టుగా చిత్ర సీమకు ఆయన ఎంతో సేవచేశారు”అని పేర్కొన్నారు.

డి.సురేష్‌బాబు, వెంకటేష్, రానా మాట్లాడుతూ సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు మరణం అత్యంత బాధాకరమని అన్నారు. ఆయన మృతి పాత్రికేయులకే కాదు యావత్ చిత్ర సీమకు తీరని లోటని పేర్కొన్నారు. హీరో నితిన్ మాట్లాడుతూ “సినీ జర్నలిజానికి, సినీ పరిశ్రమకు పసుపులేటి రామారావు సేవలు వెలకట్టలేనివి. ఆయన మృతికి సంతాపం తెలుపుతూ ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను”అని పేర్కొన్నారు. ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ కొండేటి, ప్రధాన కార్యదర్శి ఇ.జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ “నాలుగు దశాబ్దాలుగా సినీ రంగంలో విశేష సేవలు అందించిన సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు ఆకస్మిక మృతితో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాము. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము”అని అన్నారు.

 

Senior journalist Pasupuletti Rama Rao passed away
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News