Sunday, April 28, 2024

సిరిసిల్ల నేతన్నకు జాతీయ గుర్తింపు

- Advertisement -
- Advertisement -
Garments made in sircilla

 

ఇక్కడి వస్త్రానికి ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్, మార్కెట్ కల్పిస్తా
టెక్స్‌టైల్ అపెరల్ పార్కుకు మంచి పేరున్న సంస్థల పెట్టుబడులు ఆకర్షిస్తాం
కార్మికులతో చేస్తున్న ఒప్పందాలను యజమాన్యాలు గౌరవించాలి
యజమాన్యాలకు ప్రభుత్వ ప్రోత్సాహకం ఉంటుంది : మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/ సిరిసిల్ల : సిరిసిల్ల నేతన్నలకు జాతీయ స్థాయి గుర్తింపు వచ్చేలా కృషి చేస్తానని, సిరిసిల్లలో నేత కళాకారులు తయారు చేస్తున్న వస్త్రానికి ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ రావాలని ఐటి, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. సిరిసిల్లలో తయారయ్యే వస్త్రానికి ప్రత్యేక మార్కెట్ సదుపాయం కల్పిస్తామని, సిరిసిల్ల అపెరల్ పార్క్‌కు పెద్ద పెద్ద సంస్థల పెట్టుబడులు వచ్చేలా ఆకర్షిస్తామని, యజమానులు మాత్రం కార్మికులతో చేసుకున్న ఒప్పందాలు గౌరవించాలని, వారు గౌరవ ప్రదంగా, కడుపునిండా తిండి తిని పని చేసేలా యజమానులు ప్రవర్తించాలని, అభివృధ్ధిలో కార్మికులు భాగస్వాములని యజమానులు గుర్తించాలని, మాటిమాటికి కార్మికులు సమ్మెకు దిగేలా చూడవద్దని ఆయన పేర్కొన్నారు. సోమవారం సిరిసిల్ల జిల్లాలో మంత్రి కెటిఆర్ పర్యటించారు. బద్దెనపల్లి వద్ద ఉన్న టెక్స్‌టైల్ పార్క్‌లో రూ. 14.50 కోట్లతో చేపట్టిన పలు అభివృధ్ధి పనులను మంత్రి కెటిఆర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం నేతన్నల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని ఆయన పేర్కొన్నారు. నేతన్నల జీవనోపాధి కోసం బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్, ఆర్‌విఎం, కెసిఆర్ కిట్ వస్త్రాల తయారు ఆర్డర్లు ఇచ్చి ప్రోత్సహిస్తోందని ఆయన చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 50 శాతం సబ్సిడీపై నూలు, రసాయనాలను ప్రభుత్వం అందిస్తోందని కెటిఆర్ తెలిపారు. నేతకు చేయూత, చేనేత లక్ష్మి, చేనేత మిత్ర వంటి అనేక పథకాలు అమలు పరుస్తోందని ఆయన వెల్లడించారు. సిఎం కెసిఆర్ నేతన్నలకు అండగా ఉండటానికి అనేక పథకాలు ప్రవేశపెట్టారన్నారు. తెలంగాణ ప్రభుత్వం నేతన్నల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలను క్షేత్ర స్థాయిలో ఎవరిని అడిగినా చెపుతారన్నారు. నేతన్నల జీవితాలు ఇంకామెరుగుపర్చేందుకు అనేక కార్యక్రమాలు తీసుకోనున్నామన్నారు. తమ కృషిని నేతన్నలు గుర్తించడం వల్లనే మరోసారి తమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారన్నారు.

కార్మికులకు, మహిళలకు ఇంకా మెరుగైన జీవితాలు అందించేందుకు అవసరమైన శిక్షణను అందించనున్నామన్నారు. సిరిసిల్ల టెక్స్‌టైల్ పార్క్‌లో ఇప్పటి వరకు 24.50 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులకు ఖర్చు చేయగా, సోమవారం రోజు 14.50 కోట్ల రూపాయలతో అభివృధ్ధి పనులు ప్రారంభించామన్నారు. కార్మికులకు క్యాంటిన్, డ్రింకింగ్ వాటర్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, శిక్షణ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. టెక్స్‌టైల్ పార్క్‌లో సిజిఎంఎస్‌టి పథకం కింద లోన్లు తీసుకుని ఇబ్బందుల్లో ఉన్న 18 పరిశ్రమలను ఆదుకుని , వాటికి 1.80 కోట్లు రూపాయలు చెల్లించి పునరుద్దరించామన్నారు. పార్క్‌లో పారిశుధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కార్మికులకు మరుగుదొడ్లు నిర్మించాలన్నారు. కార్మికులను గుర్తించాలని, కార్మికుల శ్రమకు గుర్తింపునిస్తే వలస కార్మికులు తిరిగి మన దగ్గరికే వస్తారని కెటిఆర్ అన్నారు. తమ యూనిట్లలో పిచ్చి మొక్కలు పెరుగడం సిగ్గుచేటుగా యజమానులు భావించాలన్నారు. యజమానులకు లాభాలు సముపార్జించి పెట్టే కార్మికులకు కడుపునిండా తిండి, తగిన గౌరవం ఇవ్వాలని యజమానులకు హితవు చెప్పారు.

కరోన వల్ల దెబ్బతిన్నామని భావిస్తున్న యజమానులకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందుతాయని, అందుకోసం సిఎం కెసిఆర్‌తో తాను మాట్లాడుతానన్నారు. కరెంట్ బిల్లులు స్లాబ్ పద్ధతిలో కాకుండా వాడుకున్నంత చెల్లించేలా ఆదేశాలిచ్చామని, మూడు నెలల వాయిదా వెసులుబాటు కూడా కల్పించామన్నారు. సిరిసిల్ల టెక్స్‌టైల్, అపెరల్ పార్క్‌లను అభివృధ్ధి చేసి ఇక్కడి కార్మికులు,మహిళలకు నెలకు పది నుండి పన్నెండు వేల రూపాయల ఆదాయం వచ్చేలా చేస్తామన్నారు. సిరిసిల్లలో ఇప్పటికే స్టాఫర్ స్టాప్ లాంటి సంస్థలు పెట్టుబడి పెట్టడానికి సంసిద్దత ప్రకటించాయని, ఇంకా పెద్ద సంస్థలను ఆకర్షిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టెక్‌టైల్ డైరెక్టర్ శైలజాఅయ్యంగార్, కలెక్టర్ కృష్ణభాస్కర్, జడ్‌పి చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ, సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళచక్రపాణితో పాటుగా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్మికులు, యజమానులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News