Monday, April 29, 2024

ఆల్మట్టి టు అలసాగరం

- Advertisement -
- Advertisement -

కృష్ణ బేసిన్‌లోని అన్ని ప్రాజెక్టుల గేట్లు బార్లా

రోజుకు రెండు లక్షల క్యూసెక్కుల వరద నీరు సముద్రం పాలు
శ్రీశైలం, నాగార్జున సాగర్‌లకు ఎగువ నుంచి కొనసాగుతున్న ప్రవాహం

మన తెలంగాణ/నాగర్‌కర్నూల్ ప్రతినిధి: కృష్ణా బేసిన్‌కు వరద కొనసాగుతుండడంతో కృష్ణా నది పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టుల గేట్లన్నీ బార్లా తెరిచి దిగువకు వదులుతున్నారు. ప్రతి రోజు కృష్ణా డెల్టా సిస్టం నుంచి సుమారు రెండు లక్షల క్యూసెక్కుల వరద సముద్రం పాలవుతోంది. కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టు నుంచి ప్రకాశం బ్యారెజీ వరకు ప్రాజెక్టుల గేట్లన్నీ తెరిచి నీటిని వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 4లక్షల 50వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుంది. కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి వరద వస్తుండడంతో శ్రీశైలం జలాశయం వద్ద అధికారులు అప్రమత్తమై ప్రాజెక్టులోకి వస్తున్న ఇన్‌ఫ్లోను ఆధారంగా చేసుకుని గేట్లను హెచ్చుతగ్గులతో దిగువకు నీటిని వదులుతున్నారు. శ్రీశైలం జలాశయానికి ఆదివారం ఉదయం 11 గంటల వరకు పది గేట్లను 15 అడుగుల మేర ఎత్తి 3లక్షల 71వేల క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్ వైపు వదిలారు. సాయంత్రం 3 గంటలకు పది గేట్లను 12 అడుగులకు కుదించి 3లక్షల 12వేల క్యూసెక్కులను దిగువకు వదిలిపెడుతున్నారు. శ్రీశైలం జలాశయానికి జూరాల నుంచి 2లక్షల 73వేల క్యూసెక్కుల నీటిని 29గేట్లు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా దిగువకు వదులుతున్నారు. సుంకేసుల నుంచి 21వేల 385క్యూసెక్కుల నీటిని దిగువ శ్రీశైలంకు వదులుతున్నారు. ఆదివారం ఉదయం వరకు 4లక్షల 48వేల క్యూసెక్కుల వరద నమోదు కాగా సాయంత్రానికి 4లక్షల క్యూసెక్కులుగా నమోదయ్యింది.

ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 885 అడుగులకు గాను 883.30 అడుగులుగా నమోదయ్యింది. 215.807 టిఎంసీల కు గాను 206.0996 టిఎంసీలుగా నీటి నిల్వ నమోదయ్యింది. శ్రీశైలం కుడి గట్టు జల విద్యుత్ కేంద్రం ద్వారా 14.879 మెగా యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి దిగువ నాగార్జునసాగర్‌కు 30వేల 31 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులలో నీటి నిల్వ, దిగువకు నీటిని వదులుతున్న వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కర్ణాటకలోని అలమట్టి రిజర్వాయర్‌లో 129.72 టిఎంసీలకు గాను 109.62 టిఎంసీలుగా నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టుకు 2లక్షల 60వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుంది. అదే విధంగా నారాయణపూర్ డ్యాంలో 37.64టిఎంసీలకు గాను 30.4 టిఎంసీల నీరు నిల్వ ఉండగా 2లక్షల 42వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుంది.

తెలంగాణలోని జూరాల డ్యాంలో 9.66 టిఎంసీలకు గాను 7.72 టిఎంసీల నీరు నిల్వ ఉంది. 3లక్షల 23వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుంది. తుంగభద్ర డ్యాం పూర్తి స్థాయి నీటిమట్టం 100.86 టిఎంసీలకు గాను 100.55 టిఎంసీలు నిల్వ ఉంది. 3లక్షల 35వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులో 215.807 టిఎంసీలకు గాను 206.1 టిఎంసీల నీరు నిల్వ ఉంది. 4లక్షల 48వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుంది. నాగార్జునసాగర్‌లో 312.045 టిఎంసీలకు గాను 305.8 టిఎంసీల నీరు నిల్వ ఉండగా ఎగువ శ్రీశైలం నుంచి 3లక్షల 74వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లోని పులిచింతల ప్రాజెక్టులో 47.77 టిఎంసీలకు గాను 38.74 టిఎంసీల నీరు నిల్వ ఉండగా 3 లక్షల 27వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుంది. కృష్ణా డెల్టా సిస్టం ప్రకాశం బ్యారేజికి లక్షా 65వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుంది. ఇదిలా ఉండగా ఈ ప్రాజెక్టులలో గేట్లన్ని తెరిచి దిగువకు నీటిని వదులుతున్నారు.మరో వారం రోజుల పాటు వరద కొనసాగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

Srisailam Reservoir 11 gates lifted due to Heavy Floods

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News