Sunday, April 28, 2024

అరణ్య భవన్ లో రాష్ట్ర వన్యప్రాణి మండలి సమావేశం

- Advertisement -
- Advertisement -

State Wildlife Council

 

హైదరాబాద్ : పర్యావరణం, అడవులకు ఎలాంటి నష్టం కలగకుండా ప్రాజెక్టులు, ప్రజా అవసరాలైన అభివృద్ది పనులకు అటవీ అనుమతులు ఇస్తున్నామని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర వన్య ప్రాణి మండలి సమావేశం వైస్ చైర్మన్ హోదాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధ్యక్షతన శనివారం అరణ్య భవన్ లో జరిగింది. గత డిసెంబర్‌లో ప్రభుత్వం పునర్ వ్యవస్థీకరించి ఏర్పాటు చేసిన మండలి సభ్యలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి అభివృద్ది ఎంత ముఖ్యమో, అదే సమయంలో పర్యావరణ రక్షణకూ అంతే ప్రాధాన్యతను ఇస్తున్నామన్నారు. కమిటీలో సభ్యులైన వారు ఆదిశగా మంచి సలహాలు, సూచనలు అందించాలని మంత్రి కోరారు.

రైల్వే, జాతీయ, రాష్ట్ర రహదారుల నిర్మాణం -విస్తరణ, కవ్వాల్ పరిధిలో గ్రామాల తరలింపు తదితర అంశాల్లో అటవీ అనుమతులకు సంబంధించిన చర్చ సమావేశంలో సుదీర్ఘంగా జరిగింది. వివిధ ప్రతిపాదనలకు మండలి ఆమోదం తెలిపింది. వీటిని కేంద్ర వన్యప్రాణి మండలికి పంపిస్తామని అధికారులు తెలిపారు. ఆయా ప్రాజెక్టులు, అటవీ భూముల వినియోగంపై తొలుత అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్. శోభ సమావేశంలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. అడవులు, వన్యప్రాణులకు ఎలాంటి నష్టం కలగని రీతిలో, అదే సమయంలో ప్రజా రవాణా, ఇతర అభివృధ్ది పనులను దృష్టిలో పెట్టుకొని మాత్రమే అటవీ అనుమతులు ఇస్తున్నట్లు ఆమె వెల్లడించారు. అటవీ ప్రాంతాల్లో పనులు చేపట్టిన ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు అటవీ శాఖ పెట్టిన నిబంధనలు, నియమాలను తప్పకుండా పాటించాలని పిసిసిఎఫ్ తెలిపారు.

అనుమతి ఇచ్చిన మేరకు మాత్రమే అటవీ భూముల వాడకం జరగాలని, ఏ మాత్రం అతిక్రమించినా అటవీ చట్టాల మేరకు కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. మేడారం జాతరను దృష్టిలో పెట్టుకుని అత్యవసరంగా జరగాల్సిన రోడ్ల మరమ్మత్తులకు కూడా వన్యప్రాణి మండలి ఆమోదం తెలిపింది. ఇక రక్షిత అటవీ ప్రాంతాల్లో నిర్మాణం జరిగే రైల్వే, రహదారుల ప్రాజెక్టుల వద్ద కచ్చితంగా వేగ నియంత్రణ పాటించటం, తగిన భద్రతా ప్రమాణాలను ఏర్పాటు చేయటం, వెడల్పాటి అండర్ పాస్ ల నిర్మాణం చేపట్టేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. మండలిలో సభ్యులైన వణ్యప్రాణి నిపుణుల అనుమానాలను యూజర్ ఏజెన్సీలను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో అటవీ పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారి, అసిఫాబాద్ జెడ్‌పి చైర్ పర్సన్ కోవ లక్ష్మి, వన్యప్రాణుల సంక్షేమ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పర్యావరణహిత నిపుణులు, మండలికి నామినేట్ అయిన ఇతర సభ్యలు పాల్గొన్నారు.

State Wildlife Council Meeting at Aranya bhavan
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News