Monday, April 29, 2024

బీ కేర్‌ఫుల్

- Advertisement -
- Advertisement -

సామూహిక వ్యాప్తిలో ఉన్నాం…!
ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి
మరో 4,5 వారాలు క్లిష్టమైన పరిస్థితులు ఉండే అవకాశం
అయితే ఇతర దేశాల్లో ఉన్నంతగా మన దగ్గర వ్యాప్తి ఉండదు
కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుంది
ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన చికిత్స లభిస్తుంది
అనవసరంగా ప్రైవేట్‌కు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దు
అధిక ధరలు తీసుకునే హాస్పిటల్స్‌ను సీజ్ చేస్తాం
భయాందోళనలే మనిషిని క్షీణింపచేస్తాయి
మీడియా సమావేశంలో డిహెచ్, డిఎంఇలు వెల్లడి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా సామూహిక దశకు చేరిందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వైద్యారోగ్యశాఖ, కుటుంబ సంక్షేమ సంచాలకులు డా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో 4, 5 వారాల పాటు రాష్ట్రంలో క్లిష్టమైన పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వం కరోనా కట్టడికి అన్ని విధాలుగా కృషి చేస్తుందని, ప్రజలు సహకారం లేనిదే కరోనా కట్టడి సాధ్యం కాదని ఆయన వివరించారు. అయితే ఇతర దేశాల్లో ఉన్నట్లు మన దగ్గర దారుణమైన పరిస్థితులు ఉండబోవని ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తెలంగాణలో వైరస్ బారిన పడిన వారు వేగంగా కోలుకుంటున్నారని, రాష్ట్రంలో రికవరీ రేట్ సగటున 77 శాతానికి పెరిగిందని తెలిపారు. దీంతో పాటు మరణాల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉందని ఆయన చెప్పారు. దేశ సగటు డెత్‌రేట్ 2.5 ఉండగా, తెలంగాణలో కేవలం 0.85శాతం మాత్రమే ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు సుమారు 99 శాతం ఆరోగ్యవంతంగా ఇళ్లకు వెళ్లినట్లు ఆయన వెల్లడించారు. కరోనా వ్యాప్తి అంశంపై ఆయన కోఠి కమాండ్ కంట్రోల్ రూంలో డిఎంఇ డా రమేష్‌రెడ్డితో కలసి గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

ఈసందర్బంగా డిహెచ్ డా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో టెస్టులు సంఖ్యను పెంచామని, ప్రతి పిహెచ్‌సిలోనూ టెస్టులు జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. లక్షణాలు ఉన్న వారు, ప్రైమరీ కాంటాక్ట్‌లు, హైర్కిస్ గ్రూప్ వాళ్లు సకాలంలో ఆయా కేంద్రాలకు వెళ్లి పరీక్షలు చేపించుకోవాలని తెలిపారు. ఇప్పటి వరకు యాంటీజెన్ కిట్లు 2 లక్షల తీసుకురాగ, అవి పూర్తయ్యే దశకు వచ్చాయని, మరో 2 లక్షల కిట్లకు ఆర్డర్ ఇచ్చామన్నారు. కేవలం 15 నుంచి 30 నిమిషాల్లోనే టెస్టు చేసి, పాజిటివ్ వస్తే సదరు వ్యక్తి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో పాటు 13 ప్రభుత్వ, 23 ప్రైవేట్ కేంద్రాల్లో ఆర్‌టిపిసిఆర్, సిబినాట్, ట్రూనాట్ విధానంలో టెస్టులు చేస్తున్నామని ఆయన తెలిపారు. జిల్లా కేంద్రాల్లోనూ ఆర్‌టిపిసిఆర్ విధానంలో టెస్టులు చేస్తున్నామన్నారు.

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రోజూ 15వేల టెస్టులు చేస్తున్నామని, రాబోయే రోజుల్లో 20 నుంచి 25వేల వరకు కూడా పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లో 290 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయని, అన్ని పిహెచ్‌సిలు, బస్తీ దావఖానాల్లో కూడా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. టెస్టులను ప్రజలకు అతి దగ్గరకు తీసుకువెళ్లాలని సిఎం సూచనల మేరకు ప్రతి గ్రామంలో టెస్టులు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పాజిటివ్ వస్తే కూడా ఆయా జిల్లా కేంద్రాల్లో చికిత్స పొందేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ బారిన పడిన వారికి అవసరమైన బెడ్లన్నీ అందుబాటులో ఉన్నాయని డిహెచ్ వెల్లడించారు. ప్రభుత్వం, ప్రైవేట్ సెక్టార్ కలిపి 15వేలకు పైగా బెడ్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.

విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దు..
కరోనా సోకగానే చికిత్సకు అవసరమయ్యే విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దని డిహెచ్ పేర్కొన్నారు. చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రుల్లో అన్ని సౌకర్యాలను అందుబాటులో ఉంచామని, ప్రైవేట్‌కు వెళ్లి డబ్బులు ఖర్చుపెట్టొదని ఆయన సూచించారు. సులువైన చికిత్సకు లక్షల వృథా చేసుకోవడం వల్ల తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆయన చెప్పారు. ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. భయాందోళన చెంది ప్రైవేట్‌కి పరుగులు పెట్టకుండా, దగ్గర్లో ఉన్న ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స తీసుకోవాలని ఆయన కోరారు.

కరోనా కట్టడికి వైద్యశాఖ నిరంతరం కృషి చేస్తుంది..
కరోనా వైరస్ కట్టడికి వైద్యశాఖ గత 4 నెలలుగా నిరంతరం కృషి చేస్తుందని డిహెచ్ పేర్కొన్నారు. సుమారు ఇప్పటి వరకు వెయ్యికి పైగా వైద్య సిబ్బంది కరోనా వైరస్ బారిన పడగా ఒక్క కోఠి కార్యాలయంలోనే సుమారు 35 మందికి పాజిటివ్ వచ్చిందని ఆయన అన్నారు. తాము ప్రాణాలు పణంగా పెట్టి వైద్యం అందిస్తుంటే కొందరు కించపరిచే వ్యాఖ్యలు చేయడం దారుణమని అన్నారు. ప్రస్తుతం కోవిడ్‌తో పాటు రాబోయే రోజుల్లో సీజనల్ వ్యాధులను ఎదుర్కొనేందుకు వైద్యశాఖ అన్ని ఏర్పాట్లు చేసిందని డిహెచ్ తెలిపారు.

భయాందోళనతోనే మనిషి క్షీణిస్తాడు..
వైరస్ సోకడం కంటే చాలా మంది అపోహాలతోనే క్షీణిస్తున్నారని డా శ్రీనివాసరావు అన్నారు. రోగం తగ్గేందుకు మందులు ఉన్నాయి కానీ మానసిక భయానికి సరైన మందులు లేవని ఆయన తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ కరోనా అంశంలో బాధ్యతగా మెలగాలన్నారు. భౌతిక దూరం, మాస్కు, పరిశుభ్రత అనే మూడు నియమాలను ఖచ్చితంగా పాటిస్తే కరోనా నుంచి దూరంగా ఉండోచ్చని ఆయన వివరించారు.

ప్రైవేట్ ఆసుపత్రులపై నాలుగు రకాల ఫిర్యాదులు..
రాష్ట్రంలో ప్రైవేట్ ఆసుపత్రుల ఆగడాలు ఎక్కువైతున్నాయని డిహెచ్ పేర్కొన్నారు. ఇటీవల ఫిర్యాదుల కొరకు ఏర్పాటు చేసిన వాట్సాప్‌కు ప్రతి రోజు 100 నుంచి 120 ఫిర్యాదులు వస్తున్నాయని, వీటిలో ప్రధానంగా అధిక ఫీజులు, ఇన్సురెన్స్‌లు తీసుకోవడం లేదని, నేరుగా క్యాష్ కట్టాలని, బెడ్లను రిజర్వాడ్‌పై వస్తున్నాయని వెల్లడించారు. సదరు ఆసుపత్రుల మీద చర్యలు తీసుకోవాల్సిందిగా డిఎంహెచ్‌ఓలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. అదే విధంగా నిరంతరం పర్యవేక్షణకు టాస్క్‌పోర్సును కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అవసరమైతే దోపిడికి పాల్పడే ఆసుపత్రులను సీజ్ చేస్తామని హెచ్చరించారు.

నార్మల్ పేషెంట్‌కు అయ్యే ఖర్చు రూ. 150 నుంచి 200ః డిఎంఇ
లక్షణాలు లేకుండా, మైల్డ్ సింప్టమ్స్‌తో వైరస్ సోకిన వారికి అయ్యే మందుల ఖర్చు కేవలం రూ. 150 నుంచి 200 మాత్రమే అవుతుందని డిఎంఇ డా రమేష్‌రెడ్డి పేర్కొన్నారు. ఎలాంటి బ్రీతింగ్ సమస్యలు లేని వారు ఈ మందులు వాడుతూ ఇళ్లల్లోనే చికిత్స పొందవచ్చని ఆయన స్పష్టం చేశారు. చాలా మంది రెడిడెసివీర్, ఇతర యంటీడ్రగ్స్ ముందుగానే కొని పెట్టుకుంటున్నారని వాటి అవసరం లేదని తెలిపారు. కేవలం క్రిటికల్ కండీషన్ ఉన్న వారికే మాత్రమే ఆ మందులు అవసరం అవుతాయని ఆయన సూచించారు.

Telangana Health Officials press meet in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News