Monday, April 29, 2024

మళ్లీ పెరిగిన కేసులు

- Advertisement -
- Advertisement -

Covid

కరోనాతో మరో ముగ్గురు మృతి
28కి చేరుకున్న మరణాల సంఖ్య
కొత్తగా 22 కేసులు నమోదు, 33 మంది డిశ్చార్జ్
1038కి చేరుకున్న పాజిటివ్‌ల సంఖ్య
వైద్యారోగ్యశాఖను అప్రమత్తం చేసిన సిఎం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ బారిన పడి మరో ముగ్గురు మృత్యువాత పడ్డారు. రామాంతపూర్‌కి చెందిన 48 ఏళ్ల వ్యక్తి, వనస్థలిపురంకి చెందిన 76 ఏళ్ల వృద్ధుడు, జియాగూడకి చెందిన 44 వయస్సు గల మహిళ కరోనాతో మృతి చెందినట్లు వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నారు. దీంతో తెలంగాణలో కరోనా మరణాల సంఖ్య 28కి చేరుకుంది. చనిపోయిన వాళ్లల్లో వైరస్ సోకకముందు ఇతర ఆరోగ్య సమస్యలు ఉండటం వలనే మరణించారని వైద్యాధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా గురువారం కొత్తగా మరో 22 పాజిటివ్ కేసులు నమోదుకాగా, 33 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1038కి చేరుకోగా, వైరస్ బారిన పడి ఆరోగ్యవంతంగా ఇళ్లకు వెళ్లిన వారి సంఖ్య 442కు చేరుకుంది. ప్రస్తుతం ప్రభుత్వ నోటిఫైడ్ ఆసుపత్రుల్లో 568 మంది చికిత్స పొందుతున్నారని, వీరిలో అందరికి ఆరోగ్యం భాగానే ఉందని అధికారులు చెబుతున్నారు.
మలక్‌పేట్‌లో కరోనా కలకలం..
మలక్‌పేట్‌లో కరోనా మళ్లీ కలకలం సృష్టించింది. మలక్‌పేట్ గంజ్ లో పనిచేస్తున్న పహాడీ షరీఫ్, జల్పల్లికి చెందిన ఇద్దరు వ్యక్తుల వల్ల మార్కెట్లో ముగ్గురు షాపు యజమానులకు, వారి ద్వారా వారి కుటుంబ సభ్యులకు కరోనా వైరస్ వ్యాప్తి జరిగిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆ కుటుంబాలన్నీటిని ఆసుపత్రిలో ఐసొలేషన్ లో ఉంచామని, గంజ్, పహదీశరీఫ్ ప్రాంతాలను కంటైన్మెంట్ ప్రాంతాలుగా ప్రకటించి తగు చర్యలు తీసుకుంటున్నామని వైద్యాధికారులు తెలిపారు.
కరోనాతో మరో ముగ్గురు మృతి..
రాష్ట్రంలో కరోనాతో మరో ముగ్గురు మృతి చెందారు. 48 సంవత్సరాల వయసు గల రామంతాపూర్ కి చెందిన వ్యక్తి గాంధీ ఆసుపత్రిలో చేరిన 12 గంటల్లోనే చనిపోయారని అధికారులు తెలిపారు. ఇతనికి షుగర్, బీపీ, స్థూలకాయం,న్యుమోనియా తో బాధపడుతున్న సమయంలో కరోనా సోకిన వెంటనే శ్వాసతీసుకోవడంలో సమస్యలు ఏర్పడి మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా వసస్థలిపురంకి చెందిన 76 సంవత్సరాల వృద్ధుడు గుండె,కిడ్నీ,న్యూమోనియాతో బాధపడుతూ గాంధీ లో చేరిన 24 గంటల్లోనే చనిపోయారని అధికారులు ధ్రువీకరించారు.
దుర్గానగర్, జియాగూడకి చెందిన 44 సంవత్సరాల మహిళ కరోనా సోకి బుధవారం గాంధీ ఆసుపత్రి కి వెంటిలేటర్ మీదనే వచ్చారని, వచ్చిన గంటల్లోనే మరణించారని అధికారులు తెలిపారు. ఈమె కూడా బీపీ, షుగర్,న్యుమోనియా వంటి ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయని అధికారులు తెలిపారు.
50 ఏళ్ల డాక్టర్ డిశ్చార్జ్….గాంధీ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపిన సదరు వైద్యుడు..
కరోనా వైరస్ బారిన పడి పూర్తిగా కోలుకున్న తర్వాత గురువారం 33 మంది డిశ్చార్జ్ అయినట్లు అధికారులు తెలిపారు. కరోనాకు పూర్తి చికిత్స తరువాత, పరీక్షలో రెండు నెగెటివే రిపోర్ట్ రావడంతో డిశ్చార్జ్ అయ్యారని ఇందులో 50 సంవత్సరాల వయసుల గల డాక్టర్ కూడా డిశ్చార్జ్ అయ్యారని అధికారులు ప్రకటించారు. గాంధీలో 20 రోజుల క్రితం తీవ్ర మైన వ్యాధి లక్షణాలతో అడ్మిట్ కాగా, హైడ్రోక్సి క్లోరోక్వీన్, అజిత్రో మైసిన్ తదితర మందులు అందించి పూర్తిగా నయం చేసిన డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు.
వైద్యారోగ్యశాఖను అప్రమత్తం చేసిన సిఎం కెసిఆర్..
గత కొద్దిరోజులుగా కేసులు తగ్గుతున్న క్రమంలో గురువారం ఆకస్మత్తుగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది. గత వారం రోజులుగా సింగిల్ డిజిట్‌లో నమోదైన కేసులు, తాజాగా మళ్లీ డబుల్ డిజిట్‌కు పెరిగాయి. దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ వైద్యఆరోగ్యశాఖను అప్రమత్తం చేశారు. ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కేసులు పెరుగకుండా చూడాలని ఆదేశించారు. సిఎం ఆదేశాలమేరకు చీఫ్ సెక్రెటరీ సోమేష్ కుమార్, ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు, స్పెషల్ చీఫ్ సెక్రెటరీ శాంత కుమారి, మున్సిపల్ , వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శులతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. సిఎం గారు సూచనల మేరకు కంటైన్మెంట్ ప్రాంతాల్లో పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖ,మున్సిపల్ శాఖల సమన్వయంతో పని చేస్తున్నాయని సిఎంకి నివేదించినట్లు మంత్రి ఈటల తెలియజేశారు.
కేంద్రం ప్రశంసించడం సంతోషంగా ఉంది..
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న చికిత్స, పేషంట్లకు అందిస్తున్న సౌకర్యాలపట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తూ ఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వం ప్రశంసించడం సంతోషం అని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఇక్కడ పర్యటిస్తున్న బృందం జరుగుతున్న పరీక్షల తీరు మీద, ల్యాబ్ లు పనిచేస్తున్న విధానం పట్ల, చికిత్స పట్ల హోం శాఖ జాయింట్ సెక్రెటరీ శ్రీమతి సలీల శ్రీవాత్సవ ప్రశంశలు కురిపించారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను తు చ తప్పకుండా పాటిస్తున్నారని కేంద్ర బృందమే రిపోర్ట్ పంపిన తరువాత రాజకీయ విమర్శలకు తావు లేదని మంత్రి అన్నారు. గాంధీ, కింగ్ కోటి, గచ్చి బౌలీ, ఫీవర్ హాస్పిటల్స్, లాబ్స్, కంటేన్ మెంట్ ప్రాంతాలు, సెంట్రల్ డ్రగ్ స్టోర్స్, నైట్ షెల్టర్లలో పర్యటించి అత్యంత సంతృప్తి వ్యక్తం చేస్తూ కేంద్రానికి రిపోర్ట్ పంపించారని మంత్రి తెలిపారు.
ఈస్ట్‌మారెడ్‌పల్లిలో 11 మంది గర్భిణీలు హోం క్వారంటైన్..
హైదరాబాద్ ఈస్ట్ మారెడ్‌పల్లిలో 11 మంది గర్భిణీలు హోం క్వారంటైన్‌కి పంపించామని అధికారులు తెలిపారు. ఇటీవల 102 వాహనంలో ఈ గర్భిణీలు పరిక్షల నిమిత్తం కోఠి మెటర్నిటి ఆసుపత్రికి వెళ్లారు. అయితే వాహన సిబ్బందిలో ఒకరికి తాజాగా వైరస్ పాజిటివ్ రావడంతో ప్రస్తుతం 11 మందిని హోం క్వారంటైన్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. వీళ్లని సెంకండరీ కాంటాక్ట్ కింద పరిగణించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతామని అధికారులు తెలిపారు.
కరోనా లేని జిల్లాలు..
ఇప్పటి వరకు పాజిటివ్ కేసులు నమోదు కానీ జిల్లాలు..
వరంగల్ రూరల్, యాదాద్రి, వనపర్తి.
ప్రస్తుతానికి యాక్టివ్ కేసులు లేని జిల్లాలు…
సిద్ధిపేట్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, నారాయాణపేట్, పెద్దపల్లి, భద్రాద్రి, నాగర్‌కర్నూల్, ములుగు, సంగారెడ్డి, జగిత్యాల.
14 రోజులుగా పాజిటివ్ నమోదు కానీ జిల్లాలు..
కరీంనగర్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, భూపాలపల్లి.

22 New Corona Cases Registered in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News