Monday, May 27, 2024

నా బ్యాచిలర్ లైఫ్ పెరిగింది

- Advertisement -
- Advertisement -

సాయిధరమ్ తేజ్, నభా నటేష్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘సోలో బతుకే సోబెటర్’. సుబ్బు దర్శకత్వంలో బివిఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం జీ స్టూడియో అసోసియేషన్‌తో శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో సాయిధరమ్‌తేజ్‌తో ఇంటర్వూ విశేషాలు…
మన ఫ్రీడమ్ మన చేతిలో…
ఈ సినిమా కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. కొంతవరకు మన స్వేచ్ఛ తల్లిదండ్రుల చేతిలో ఉంటుంది. పెళ్లయిన తర్వాత భార్య, పిల్లల చేతిలో ఉంటుంది. ఇలా ఒకరి చేతిలో మన స్వేచ్ఛ ఉండిపోతుంది. దీనికి సంబంధించి ఈ సినిమాలో ‘మన ఫ్రీడమ్ మన చేతిలోఉంటుంది’ అనే డైలాగ్ కూడా పెట్టాం.
సమస్యలను ఎలా అధిగమించాడు…
ఈ సినిమాలో హీరో విరాట్ తన ఫిలాసఫీని ఎంత వరకు నమ్ముతున్నాడు… దాని వల్ల తనకు వచ్చే సమస్యలు ఏంటి? వాటిని ఎలా అధిగమించాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
బ్యాచిలర్ లైఫ్ పెరిగింది…
పెళ్లి చేసుకోకూడదని నేను అనుకున్నప్పటికీ… మా అమ్మ నా పెళ్లి చేయాలని అనుకుంటోంది. నేను ఎంత వద్దు అనుకున్నా చివరికి నా పెళ్లి చేస్తారు. అయితే వీలైనంత కాలం మన బ్యాచిలర్ లైఫ్‌ను పొడిగించగల్గుతాం. ప్రస్తుతం లాక్‌డౌన్ వల్ల నా బ్యాచిలర్ లైఫ్ ఏడాదిన్నర కాలం పెరిగింది.
పాటలకు మంచి స్పందన…
ఇక ఈ చిత్రంతో తమన్‌తో కలిసి ఐదో సినిమా చేస్తున్నాను. పాటలు చాలా బాగా వచ్చాయి. నో పెళ్లి, హే ఇది నేనేనా, అమృత సాంగ్, టైటిల్ ట్రాక్… ఇలా అన్నింటికీ మంచి స్పందన వచ్చింది.
అందరూ ఎంజాయ్ చేసే…
ఈ సినిమాను మే 1న విడుదల చేద్దామనుకున్నాం. కానీ లాక్‌డౌన్ వల్ల వాయిదా పడుతూ వస్తూ చివరికి శుక్రవారం ‘సోలో బ్రతుకే సో బెటర్’ విడుదలకానుంది. ఫ్యామిలీ, యూత్ అందరూ కలిసి ఎంజాయ్ చేసే చిత్రమిది.
ఎంటర్‌టైన్‌మెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో…
పెళ్లి విషయంలో ప్రస్తుతం యూత్ ఆలోచనలు, వారి తల్లిదండ్రుల ఆలోచనలు ఎలా ఉన్నాయి? అనే అంశాలను తీసుకొని ఈ చిత్రం రూపొందింది. మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఫ్యామిలీ ఎమోషన్స్‌ని జోడించి దర్శకుడు సుబ్బు ఈ చిత్రాన్ని చక్కగా తెరకెక్కించాడు.
తదుపరి చిత్రాలు…
ప్రస్తుతం దేవా కట్టా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను. ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తయింది. ఇందులో ఒక యువ ఐఏఎస్ ఆఫీసర్‌గా కనిపిస్తా. అలాగే సుకుమార్ శిష్యుడి దర్శకత్వంలో ఓ మిస్టికల్ థ్రిల్లర్ చేస్తున్నాను. 2021లో ఈ రెండు సినిమాలను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాము.

Sai Dharam Tej interview about ‘Solo Brathuke So Better’ 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News