Monday, April 29, 2024

అక్షయ్ క్యురేటివ్ పిటిషన్ డిస్మిస్

- Advertisement -
- Advertisement -

స్టే పిటిషన్‌కు సుప్రీం నో
ఉరి అమలుపై స్టే కోరిన నిర్భయ దోషులు
ఢిల్లీ కోర్టులో లాయర్ పిటిషన్ దాఖలు

 

న్యూఢిల్లీ: నిర్భయ కేసులో ఉరిశిక్ష పడిన నలుగురు నేరస్థుల్లో ఒకడైన అక్షయ్ కుమార్ సింగ్ దాఖలు చేసుకున్న క్యురేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం తిరస్కరించింది. ఫిబ్రవరి 1న ఉరిశిక్ష అమలు చేయకుండా స్టే విధించవలసిందిగా కోరుతూ అతను వేసిన మరో పిటిషన్ ను కూడా అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ‘మౌఖిక విచారణ కోరుతూ వేసిన దరఖాస్తు తిరస్కరింపబడింది. మేము క్యురేటివ్ పిటిషన్లను, సంబంధిత డాక్యుమెంట్లను పరిశీలించాం. అయితే, రూపా అశోక్ హుర్రా వర్సెస్ అశోక్ హుర్రా మరొకరికి కేసులో చేసిన నిర్ణయం పరిధిలో వీటిని చేపట్టేందుకు తగిన కారణాలు కనిపించడం లేదు. కాబట్టి క్యురేటివ్ పిటిషన్లు తిరస్కరించబడ్డాయి’ అని అయిదుగురు జడ్జీల ధర్మాసనం ఛాంబర్‌లో జరిపిన విచారణలో పేర్కొంది. న్యాయమూర్తులు ఎన్‌వి రమణ, అరుణ్ మిశ్రా, ఆర్‌ఎఫ్ నారిమన్, ఆర్. భానుమతి, అశోక్‌భూషణ్ ఈ ధర్మాసనంలో ఉన్నారు.

ప్రజల వత్తిడికి తలవొగ్గి…

మహిళలపై జరిగే హింసలకు సంబంధించిన కేసుల్లో ఆధారాలతో సంబంధం లేకుండా ప్రజల వత్తిడి, వారి అభిప్రాయాలకు ప్రకారం కోర్టులు మరణశిక్ష విధిస్తున్నాయని, శిక్షల్ని తగ్గించడం లేదని అక్షయ్ బుధవారం సుప్రీంకోర్టులో వేసిన క్యురేటివ్ పిటిషన్‌లో పేర్కొన్నాడు. క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేయడం ఒక వ్యక్తికి న్యాయపరంగా ఉన్న చివరి అవకాశం.‘నేరంలోని క్రూరత్వాన్నిబట్టే అందుకు తగిన విధంగా సుప్రీంకోర్టు మరణశిక్ష విధిస్తుందని నమ్ముతున్నాను. కానీ ఈ కోర్టుకు, దేశంలో ఇతర క్రిమినల్ కోర్టులకు అలాంటి నిశ్చితాభిప్రాయం లేదు. రేప్, హత్యకు సంబంధించిన 17 కేసుల్లో ముగ్గురు జడ్జీలున్న సుప్రీం ధర్మాసనం మరణశిక్షనే విధించింది’ అని అక్షయ్ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు.

మిగిలిన అవకాశం

నిర్భయ సామూహిక అత్యాచారం కేసులో క్యురేటివ్ పిటిషన్లను దాఖలు చేసుకున్న నేరస్థుల్లో అక్షయ్ మూడో వ్యక్తి. అంతకు ముందు ఇదే కేసులో నేరస్థులు వినయ్, ముఖేష్‌ల క్యురేటివ్ పిటిషన్లను సుప్రీంకోర్టు ఇదివరకే డిస్మిస్ చేసింది. నాలుగో నేరస్థుడు పవన్‌గుప్తా క్యురేటివ్ దాఖలు చేయలేదు. అయితే, అతనికి అవకాశం ఉంది. ఈ కేసులో నలుగురు దోషులు ముకేష్ (32), పవన్ (25), వినయ్ (26), అక్షయ్ (31) లకు ఫిబ్రవరి 1న ఉదయం 6 గంటలకు ఉరిశిక్ష అమలు చేయాలని ట్రయల్ కోర్టు జనవరి 17న రెండోసారి బ్లాక్ వారెంట్లు జారీ చేసింది. అంతకు ముందు జనవరి 22న ఉరిశిక్ష అమలు చేయాలని ట్రయల్ కోర్టు జనవరి 7న ఆదేశించింది. ఇక అక్షయ్‌కు మిగిలిన ఒకే ఒక అవకాశం రాష్ట్రపతి క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకోవడం.

స్టే కోరుతూ…

ఇలా ఉండగా, నిర్భయ కేసులో దోషులకు ఫిబ్రవరి 1న ఉరిశిక్షలు అమలు కాకుండా స్టే కోరుతూ వారి తరఫు న్యాయవాది గురువారంనాడు ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. వారిలో కొందరికి న్యాయపరమైన మినహాయింపుల్ని వినియోగించుకునే అవకాశం ఇప్పటికీ ఉందని దోషుల లాయర్ పేర్కొన్నారు. తనకు అందిన పిటిషన్‌పై విచారణ జరుపుతామని స్పెషల్ జడ్జి ఎకె జైన్ చెప్పారు.

SC dismisses Nirbhaya convict’s curative petition
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News