Monday, April 29, 2024

కివీస్‌కు సవాలే..

- Advertisement -
- Advertisement -

Test series

 

వెల్లింగ్టన్: భారత్‌తో జరిగే టెస్టు సిరీస్ ఆతిథ్య న్యూజిలాండ్‌కు సవాలు వంటిదేనని విశ్లేషకులు అంచన వేస్తున్నారు. వన్డేల్లో భారత్‌పై క్లీన్‌స్వీప్ సాధించిన కివీస్‌కు టెస్టుల్లో మాత్రం గట్టి పోటీ ఎదురు కావడం ఖాయమని వారు జోస్యం చెబుతున్నారు. కొంతకాలంగా టెస్టుల్లో భారత్ వరుస విజయాలు సాధిస్తున్న విషయం తెలిసిందే. వెస్టిండీస్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ తదితర జట్లతో జరిగిన సిరీస్‌లలో భారత్ క్లీన్‌స్వీప్ సాధించింది. మరోవైపు న్యూజిలాండ్ మాత్రం టెస్టుల్లో వరుస పరాజయాలు చవిచూస్తోంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఐదు టెస్టులు ఆడిన న్యూజిలాండ్ ఒక టెస్టులో మాత్రమే విజయం సాధించింది. మిగిలిన నాలుగు మ్యాచుల్లో కివీస్‌కు పరాజయాలే ఎదురయ్యాయి. ఇక, భారత్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఏడు మ్యాచులు ఆడగా అన్నింటిలోనూ విజయం సాధించి ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచింది. ప్రస్తుతం భారత్ 360 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

న్యూజిలాండ్ మాత్రం కేవలం 60 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది. వన్డేలు, టి20 ఫార్మాట్‌లలో బాగానే ఆడుతున్న కివీస్ టెస్టులకు వచ్చే సరికి తేలిపోతోంది. ఏ ఒక్క సిరీస్‌లోనూ మెరుగైన ఆటను కనబరచలేక పోతోంది. ప్రస్తుతం టెస్టుల్లో భారత్, ఆస్ట్రేలియాలు మాత్రమే అద్భుతంగా రాణిస్తున్నాయి. మిగతా జట్లు మాత్రం టెస్టుల్లో మెరుగైన ప్రదర్శన కనబరచడంలో విఫలమవుతున్నాయనే చెప్పాలి. మరోవైపు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ చాలా బలంగా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. టెస్టుల్లో చటేశ్వర్ పుజారా, అజింక్య రహానె, విరాట్ కోహ్లిలకు కళ్లు చెదిరే రికార్డు ఉంది. యువ ఆటగాళ్లు పృథ్వీషా, మయాంక్ అగర్వాల్‌లు కూడా టెస్టుల్లో మెరుగ్గానే రాణిస్తున్నారు. ఈసారి కూడా జట్టు వీరిపై భారీ ఆశలు పెట్టుకుంది. అయితే నిలకడలేమి భారత్‌కు సమస్యగా తయారైంది. కానీ, టెస్టు మ్యాచ్ ప్రారంభానికి ముందు భారత బ్యాట్స్‌మెన్ ఫామ్‌ను అందుకునే అవకాశాలున్నాయి.

ఇదే జరిగితే కివీస్ బౌలర్లకు కష్టాలు ఖాయం. బౌలింగ్‌లో కూడా భారత్ చాలా బలంగా ఉంది. బుమ్రా ఫామ్ కలవర పెడుతున్నా టెస్టుల్లో పుంజుకునే అవకాశాలున్నాయి. మహ్మద్ షమి, ఉమేశ్ యాదవ్‌లతో భారత బౌలింగ్ పటిష్టంగా కనిపిస్తోంది. అంతేగాక రవీంద్ర జడేజా, రవిచంద్రన్ వంటి ప్రపంచ అత్యుత్తమ స్పిన్నర్లు ఉండనే ఉన్నారు. దీంతో టీమిండియాతో పోరు కివీస్‌కు సవాలుగా తయారైంది. అసాధారణ ఆటను కనబరిస్తే తప్ప భారత్‌కు గట్టి పోటీ ఇవ్వడం సాధ్యం కాదు. అయితే సొంత గడ్డపై ఎప్పుడూ ప్రమాదకర జట్టుగానే న్యూజిలాండ్‌ను పరిగణించక తప్పదు. విలియమ్సన్, రాస్ టైలర్, గ్రాండోమ్, సౌథి, బౌల్ట్, వాగ్నర్ తదితరులతో న్యూజిలాండ్ బలంగానే ఉంది. దీంతో టెస్టు సిరీస్ ఆసక్తికరంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Test series with India is difficult for New Zealand
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News