Monday, May 27, 2024

దేశం ‘విషవలయం’నుంచి బైటపడుతోంది

- Advertisement -
- Advertisement -

Launch of ‘PM Cares for Children’ scheme

ఎనిమిదేళ్లుగా మా ప్రభుత్వం పేదల సంక్షేమానికే అంకితమైంది
‘పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్’ పథకం ప్రారంభం సందర్భంగా ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: 2014కు ముందు దేశం అవినీతి, కుంభకోణాలు, ఆశ్రిత పక్షపాతం, దేశమంతటా విస్తరించిన ఉగ్రవాద సంస్థలు, ప్రాంతీయ వివక్షతో కూడిన విషవలయంలో చిక్కుకు పోయి ఉండిందని, అయితే ఇప్పుడు దేశం ఈ విషవలయంనుంచి బైటపడుతోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. తమ ప్రభుత్వం ఎనిమిదేళ్ల పాలన పేదల సంక్షేమానికే అంకితమైందని ఆయన అన్నారు. కరోనా మహమ్మారితో తలిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారుల కోసం కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న ‘పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్’ పథకం ప్రయోజనాలను ప్రధాని మోడీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడుదల చేశారు. ఈ పథకం కింద పాఠశాలలకు వెళ్లే చిన్నారులకు ఉపకార వేతనాలతో పాటుగా పిఎం కేర్స్ పాస్‌బుక్, ఆయుష్మాన్ భారత్, జన్‌ఆరోగ్య యోజన హెల్త్ కార్డులను పంపిణీ చేస్తారు. లబ్ధిదారులకు అయిదు లక్షల రూపాయల దాకా అవసరమయ్యే వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ తన ప్రభుత్వం ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంటున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు.

దేశ ప్రజల ఆత్మవిశ్వాసం గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువగా ఉందన్నారు. కొవిడ్ మహమ్మారి కారణంగా తలెత్తిన ప్రతికూల ప్రభావంనుంచి బయటపడిన దేశం ప్రపంచంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిచిందన్నారు. ప్రపంచం భారత్ వైపు సరికొత్త ఆశలు, విశ్వాసంతో చూస్తోందన్నారు.2014కు ముందు దేశం అవినీతి, స్కామ్‌లు, ఆశ్రిత పక్షపాతం, దేశమంతటా విస్తరిస్తున్న ఉగ్రవాద సంస్థలు, ప్రాంతీయ వివక్షలతో కూడిన విష వలయంలో చిక్కుకుని ఉండింది. అయితే ఇప్పుడు దేశం ఆ విషవలయంనుంచి బయటపడుతోంది’ అని గత కాంగ్రెస్ ప్రభుత్వాలను పరోక్షంగా ప్రస్తావిస్తూ ప్రధాని అన్నారు. అత్యంత కఠినమైన రోజులను కూడా అధిగమించవచ్చనే దానికి ఇదో ఉదాహరణ అని చిన్నారులనుద్దేశించి ఆయన అన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్, జన్‌ధన్ యోజన, హర్‌ఘర్ జల్ యోజన లాంటి పథకాలను ప్రధాని ప్రస్తావిస్తూ ,తమ ప్రభుత్వం సబ్‌కా సాథ్, సబ్‌కా విశ్వాస్, సభ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్ స్ఫూర్తితో ముందుకు వెళ్తోందన్నారు.

గత ఎనిమిదేళ్ల తమ పాలన పేదల సంక్షేమం, సేవ కోసం అంకితమయిందన్నారు. ‘ఒక కుటుంబ సభ్యుడిగా మేము దేశంలోని పేద ప్రజల కష్టాలను తగ్గించడానికి, వారి జీవితాలను మెరుగుపర్చడానికి ప్రయత్నించాం’ అని మోడీ అన్నారు. సాంకేతిక వినియోగాన్ని పెంచడం ద్వారా పేదప్రజలు తమ హక్కులను పొందేలా ప్రభుత్వం చేసిందన్నారు. ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు తమకు లభిస్తాయన్న విశ్వాసంతో పేదప్రజలు ఉన్నారన్నారు. గత ఎనిమిదేళ్ల కాలంలో భారత దేశం సాధించిన ఉన్నత శిఖరాలను ఇంతకు ముందు ఎవరూ ఊహించలేదన్నారు. ఇప్పుడు ప్రంచవ్యాప్తంగా భారత్ ప్రతిష్ఠ, అంతర్జాతీయ వేదికలపై మన శక్తిపెరిగిందని ప్రధాని అన్నారు. నరేంద్ర మోడీ 2014 మే 26న తొలిసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించగా, 2019 మే 30న రెండోసారి ప్రధానిగా ప్రమాణం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News