Saturday, May 25, 2024

ప్రియాంకను అడ్డుకున్న యూపీ పోలీసులు

- Advertisement -
- Advertisement -

Priyanka

న్యూఢిల్లీ: పోలీసు కస్టడీలో చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడానికి ఆగ్రాకు వెళుతున్న కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రాను ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ రహదారిలో అడ్డుకున్నారు. “నన్ను ఆగ్రా వెళ్లకూడదని వారన్నారు. నేను ఎక్కడికి వెళుతున్నా వారు నన్ను అడ్డుకోవాలని చూస్తున్నారు. అంటే నేను రెస్టారెంట్‌లో కూర్చుని ఉండిపోవాలా? అదే వారికి రాజకీయంగా బాగుంటుందనుకుంటున్నారా? నేను ఆ బాధితులను కలవాలనుకుంటున్నాను. ఇందులో అడ్డుకోడానికి కారణం ఏమి ఉంది?” అని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు.

“పార్టీ కార్యాలయానికి కాకుండా ఎక్కడికి వెళ్లాలనుకున్నా వారు నన్ను అడ్డుకుంటున్నారు. ఇది ప్రజలకు కూడా ఇబ్బందికరంగా మారుతోంది” అని ఆమె అన్నారు. ఆమె కాన్వాయ్‌ను అడ్డుకున్నాక ఆమెను పోలీస్ లైన్‌కు తీసుకెళ్లారు. తర్వాత మధ్యాహ్నం లక్నో పోలీస్ కమిషనరేట్ ఆమెను, మరి ఐదుగురిని వెళ్లేందుకు అనుమతినిచ్చింది.
ప్రియాంక గాంధీని అరెస్టు చేయలేదని లక్నో పోలీసులు వివరణ ఇచ్చారు. జనం గుమ్మికూడడం వల్లనే ఆమెను పోలీస్ లైన్‌కు తరలించామని వారు చెప్పుకొచ్చారు. ఇదిలావుండగా కొంత మంది మహిళా పోలీసులు ప్రియాంక గాంధీతో సెల్ఫీ తీసుకోడానికి ఉత్సాహం కనబరిచారు.

“ఆమెను మేము కస్టడీలోకి తీసుకోవడం లేక అరెస్ట్ చేయడం వంటివి చేయలేదు. జనం పెద్ద సంఖ్యలో పోగవ్వడం వల్ల, ట్రాఫిక్ రాకపోకలకు ఇబ్బంది కలగడం వల్ల ఆమెను ఇంటికైనా లేక కార్యాలయానికైనా వెళ్లిపొమ్మని కోరాము. కానీ ఆమె వినిపించుకోలేదు.దాంతో ఆమెను పోలీస్ లైన్స్‌కు పంపాల్సి వచ్చింది.” అని లక్నో పోలీస్ కమిషనర్ డికె ఠాకుర్ తెలిపారు.
రూ. 25 లక్షలు దొంగిలించాడన్న నేరారోపణతో అరుణ్ వాల్మీకి అనే వ్యక్తిని జగదీశ్‌పురా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ అతడు కస్టడీలో మరణించాడు. ఆ అరుణ్ వాల్మీకి కుటుంబ సభ్యులను కలిసేందుకు ప్రియాంక గాంధీ ఆగ్రా వెళ్లాలనుకున్నారు. పోలీసు కస్టడీలో మరణించి అతడి చావు ఘటనపై ప్రియాంక గాంధీ అనుమానాలు లేవనెత్తారు. అతడి చావు ఉదంతం ఖండనీయమన్నారు. ఉన్నతాధికారులతో దర్యాప్తు జరిపించాలని కోరారు. బాధితుడి కుటుంబానికి నష్టపరిహారం ఇప్పించాలన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News