Monday, May 13, 2024

కొనసాగుతున్న ఉత్కంఠ

- Advertisement -
- Advertisement -

అంతు చిక్కడం లేదు.. నాడి పట్టడం లేదు…
పదుల సంఖ్యలో ఆశావహులు… ఆశావహుల తాకిడితో గాంధీభవన్ కళకళ…
పిసిసి సారధి తేల్చే అంశంపై మాణికం ఠాగూర్ మల్లగుల్లాలు…

Who is congress president in Telangana

మన తెలంగాణ/హైదరాబాద్: వరుస వైఫల్యాలు చవి చూస్తున్నా కాంగ్రెస్ పార్టీ నేతల్లో నేటికి సమన్వయం అనేది మచ్చుకైనా కానరావడం లేదు. ఎవరికి వారే యమునాతీరే అన్న చందంగా పార్టీ నేతల వ్యవహారశైలి ఉంటోందని చెప్పక తప్పదు. కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్ గత రెండు రోజులుగా గాంధీభవన్‌లో పిసిసి సారధి తేల్చే అంశంపై సుదీర్ఘంగా మంతనాలు జరుపుతున్నారు. పిసిసి రేసులో పదుల సంఖ్యలో ఆశావహులు ఉంటున్నారు. ఆశావహుల తాకిడితో రెండ్రోజులుగా గాంధీభవన్ కళకళలాడుతోంది. మునుపెన్నడూ లేని విధంగా గాంధీభవన్‌లో సందడి వాతావరణమైతే నెలకొందని అంటున్నారు. దాదాపుగా 150 మంది కీలక నేతల నుంచి అభిప్రాయ సేకరణను మాణికం ఠాగూర్ కానిస్తున్నారు.

ఈ క్రమంలో పదుల సంఖ్యలో ఉన్న ఆశావహులు మాత్రం తమకు పిసిసి పదవిని అప్పగిస్తే 2023లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తున్నామని ఠాగూర్‌కి విన్నవించుకున్నట్లు సమాచారం. అసలు పిసిసి పదవి ఎవరికి అప్పగిస్తే పార్టీ పూర్వ వైభవం వస్తుందన్న సదుద్దేశంతో మాణికం ఠాగూర్ ప్రయత్నిస్తుంటే అందుకు భిన్నంగా ఇక్కడి కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తూ మాణికం ఠాగూర్‌ని ఎటూ తేల్చుకోలేని సందిగ్ధ స్థితిలోకి నెట్టివేస్తున్నారని చెబుతున్నారు. రేసులో రేవంత్, కోమటిరెడ్డిలు పేర్లు ప్రముఖంగా వినవస్తున్నా.. అవేవీ పట్టించుకోని ఇతర కీలక నేతలు సైతం తమకు అధ్యక్ష పదవి ఇవ్వాలంటూ మాణికం ఠాగూర్‌ని వేడుకుంటున్నారని అంటున్నారు. పిసిసి అధ్యక్ష పదవికి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాజీనామా అనంతరం పిసిసి నూతన సారథి ఎంపిక ప్రక్రియ ఊపందుకున్న సంగతి తెలిసిందే. అంతకు ముందు సైతం పిసిసి అధ్యక్ష పదవి నుంచి తాను తప్పుకుంటానని..

తన స్థానంలో ఎవరినైనా నియమించుకోండని ఉత్తమ్ అన్న సందర్భం ఉంది. ఇలా చాన్నాళ్లుగా పిసిసి అధ్యక్ష పదవి ఎంపిక అనేది కొనసాగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ పదవిపై కన్నేసిన నేతలు.. రేసులో ఉన్న నేతలు అధిష్టానం వద్ద తమ పలుకుబడిని వినియోగించుకునేందుకు యత్నించిన సందర్భాలనేకం. ఆ సమయంలోనే పార్టీలో ఇతర నేతలు రేసులో ఉన్న వారిని అడ్డుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించిన దాఖలాలు లేకపోలేదు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ముళ్లపొదను కదిలించే కన్నా ఉత్తమ్‌నే కొనసాగించాలని అధిష్టానం నిశ్చితాభిప్రాయానికి వచ్చి ఉత్తమ్‌నే అప్పట్నించీ కొనసాగిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దుబ్బాకలో ఘోర వైఫల్యం.. గ్రేటర్‌లో చావుతప్పి కన్నులొట్టపోయిన చందంగా రెండే రెండు స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకున్న దరిమిలా ఉత్తమ్ నైతిక బాధ్యత వహిస్తూ పిసిసి అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

దీంతో పిసిసి నూతన అధ్యక్షుడి ఎంపిక అధిష్టానంకు అనివార్యంగా మారింది. మరో ముఖ్యమైన పరిణామం కూడా చోటు చేసుకుంటోంది. సామాజిక సమీకరణాల కూర్పు పేరుతో కొందరు రేసులో వున్న ఆ ఇద్దరిని శాయశక్తులా అడ్డుకుంటున్నారన్న ప్రచారం కొనసాగుతోంది. అయితే, వ్యూహాత్మకంగా పావులు కదపగలిగే నైపుణ్యం ఉన్న మాణికం ఠాగూర్ మాత్రం ప్రతి కీలక నాయకుడికి పది నిమిషాలు కేటాయిస్తూ శ్రద్ధగా వారి వారి అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో తన అభిప్రాయాలను మాత్రం ఠాగూర్ సదరు నాయకులతో చెప్పడం లేదని తెలుస్తోంది. ఇలా తనదైన శైలిలో మాణికం ఠాగూర్ ఇక్కడి కీలక నేతల అభిప్రాయాలను పరిగణన, పరిశీలన చేస్తున్నట్లు సమాచారం. ఇంతలా తన చాతుర్యాన్ని ప్రదర్శిస్తోన్నా ఇక్కడి నేతల్లో ఉన్న సమన్వయ లేమి మాణికం ఠాగూర్‌కు రుచించడం లేదని చెబుతున్నారు. పార్టీ బతికి బట్ట కట్టాలంటే ముందుగా పార్టీలో సమన్వయం అత్యవసరమని పలు సందర్భాల్లో ఆయన పార్టీ నేతలకు దిశానిర్దేశన చేస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ కార్యరూపంలోకి రాగానే సదరు నేతలు ఎవరికి వారే అన్న తీరుగా వ్యవహరించడం మాణికం ఠాగూర్‌కి విసుగుని తెప్పిస్తోందని అంటున్నారు. రెండ్రోజులుగా ఎడతెరపి లేకుండా మాణికం ఠాగూర్ కాంగ్రెస్ కీలక నేతలతో పిసిసి అధ్యక్ష పదవి ఎంపికపై తనదైన శైలిలో చర్చోపచర్చలు కొనసాగిస్తున్నారు. అయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన పరిస్థితి ఉందని, కొంత అయినా ముందుకు సాగని పరిస్థితి ఉందని అంటున్నారు.

ఈ పరిస్థితులను ముందుగానే అంచనా వేశారో.. ఏమో కానీ.. మాణికం ఠాగూర్ అంతకు ముందు పిసిసి పదవి ఎంపిక అనేది అధిష్టానమే చూసుకుంటుందని వ్యాఖ్యానించిన సంగతి ఈ సందర్భంగా గమనార్హం. నేడు (శుక్రవారం) కూడా చర్చలు(అభిప్రాయ సేకరణ) కొనసాగే అవకాశం ఉంది. మరి నేటి చర్చల్లో అధిష్టానం సూచించిన విధంగా మాణికం ఠాగూర్ ఇక్కడి నేతలలో సమన్వయం కలిగించి అధిష్టానం సూచించినట్లుగా చెప్పబడుతున్న రేసులో ఉన్న ఆ ఇద్దరిలో ఒకరిని పిసిసి అధ్యక్షుడిగా ప్రతిపాదించే అవకాశం ఉందా? లేదా? అనేది తేలనుంది. దూకుడుని ప్రదర్శించే వ్యక్తికి పార్టీ పగ్గాలు అప్పగించాలనేది అధిష్టానం యోచనగా ఉందని చెబుతున్నారు. మరోవైపు ఉత్తమ్ బుధవారం సమావేశం నుంచి బయటికి వెళుతూ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బెస్టాఫ్ లక్ చెప్పడం వెనుక ఆంతర్యంపై ఆ పార్టీ నేతలు పెదవి కొరుక్కుంటున్నారు. మరోవైపు జగ్గారెడ్డి, విహెచ్ తదితరులతో పాటు తాజాగా నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి మరి తాను టిపిసిసి రేసులో ఉన్నానంటూ అంజన్‌కుమార్ యాదవ్ సైతం ప్రకటించడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీంతో తెలంగాణ కాంగ్రెస్‌ని గాడిన పెట్టడమెలా? అన్నదానిపై మాణికం ఠాగూర్ తన చతురతను ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైందని అంటున్నారు.

అధిష్టానం చెప్పిన వ్యక్తికి పిసిసి పదవి కట్టబెట్టేలా శుక్రవారం మాణికం ఠాగూర్ పార్టీ నేతలకు ఏ విధంగా దిశా నిర్ధేశన చేస్తారనేది? ప్రస్తుతం అందరిని తొలిచేస్తున్న ప్రశ్న. అసలు సోనియా జన్మదిన వేడుకల సందర్భంగా ఈ నెల 9నే పిసిసికి నూతన సారథి రావాల్సి వున్నా.. తెలంగాణ కాంగ్రెస్‌లో ఉన్న అస్తవ్యస్త పరిస్థితుల దృష్టా అది సాధ్యపడలేదని అంటున్నారు. మరి కీలకంగా మారనున్న శుక్రవారం నాడు చర్చలలో పిసిసి సారథి ఎవరు? అనేది తేలుస్తారా? లేక మరికొంతకాలం సాగదీత ఉంటుందా? అన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News