Monday, May 13, 2024

మరింత ఆలస్యం కానున్న గాజా కాల్పుల విరమణ

- Advertisement -
- Advertisement -

శుక్రవారం నుంచి అమలవుతుందని ఇజ్రాయెల్ ప్రకటన

గాజా: ఇజ్రాయెల్ హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమలు మరికాస్త ఆలస్యం కానుంది. ప్రస్తుతం గాజాపై దాడులు కొనసాగుతూనే ఉంటాయని ఇజ్రాయెల్ అధికారులు స్పష్టం చేశారు. శుక్రవారం తర్వాతే ఒప్పందం అమలవుతుందని వారు తెలిపారు. గురువారం ఒప్పందం అమలవుతుందని అందరూ భావిస్తున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రభుత్వం ఈ వివరణ ఇవ్వడం గమనార్హం. గత అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్‌పై ఉగ్రదాడి జరిపిన విషయం తెలిసిందే. వందలాది మంది ప్రాణాలను బలి మందిని అపహరించి గాజాలో బందీలుగా చేసుకుంది.దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ గాజాపై విరుచుకు పడుతోంది.

హమాస్ అంతమే లక్ష్యంగా భీకర దాడులు కొనసాగిస్తోంది. ఈ యుద్ధానికి తాత్కాలిక విరామం ఇవ్వాలని ఖతర్ సహా పలు దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి.ఈ క్రమంలోనే నాలుగు రోజుల పాటు యుద్ధానికి తాత్కాలిక విరామం ఇచ్చేలా ఇజ్రాయెల్, హమాస్ మధ్య అంగీకారం కుదిరింది. దీని ప్రకారం బందీలుగా ఉన్న 50 మందిని హమాస్ విడుదల చేస్తుండగా, దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ తమ జైళ్లలో ఉన్న 150 మంది పాలస్తీనియన్లను విడుదల చేయడంతో పాటుగా గాజాకు మానవతా సాయం అందించడానికి ముందుకు వచ్చింది. బుధవారం ఈ ఒప్పందానికి ఆమోదముద్ర కూడా పడింది. ఒప్పందంలో భాగంగా హమాస్ 50 మంది చిన్నారులు,మహిళలను మాత్రమే విడిచిపెట్టనుంది.

అలాగే పాలస్తీనా ఖైదీల్లో మహిళలు, 18 ఏళ్ల లోపు ఉన్న బాలురను మాత్రమే ఇ.్రఆయెల్ విడిచిపెట్టనుంది. కాగా బుధవారం కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అలస్యం కానున్నట్లు ఇజ్రాయెల్ జాతీయ భద్రతా సలహాదారు జచి హనెగ్బి చెప్పారు. అయితే ఆలస్యానికి కారణాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. కాల్పుల విరమణ, బందీల మార్పిడికి అనువైన పరిస్థితులను సృష్టించడానికి మధ్యవర్తులు ఇంకా ప్రయత్నిస్తున్నారని హమాస్‌తో మధ్యవర్తిత్వంలో కీలక పాత్ర పోషించిన ఖతర్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి మాజెద్ అల్‌అన్సారీ చెప్పారు.

13 వేలు దాటిన మరణాలు
ఇదిలా ఉండగా యుద్ధంలో చనిపోయిన పాలస్తీనియన్ల వివరాలను నమోదు చేయడాన్ని గాజాలో అధికారంలో ఉన్న హమాస్ ప్రభుత్వ ఆరోగ్యశాఖ తిరిగి ప్రారంభించింది. ఇప్పటివరకు యుద్ధంలో 13 వేల మందికి పైగా చనిపోయినట్లు తాజాగా ప్రకటించింది. అయితే ఉత్తర గాజా ఆస్పత్రుల్లో చనిపోయిన వారి వివరాలు దీనిలో లేవు. ఉత్తర గాజా ప్రాంతంలో కమ్యూనికేషన్ వ్యవస్థ, సేవలు దాదాపుగా ధ్వంసమైన నేపథ్యంలో అక్కడ చనిపోయిన వారి వివరాలను సేకరించడాన్ని మంత్రిత్వ శాఖ ఈ నెల ప్రారంభంనుంచి నిలిపి వేసింది. ఉత్తర గాజా ప్రాంతంలో దాదాపు 6 వేల మంది జాడ ఇప్పటికీ తెలియడం లేదని, బభుశా వీరంతా భవన శిథిలాల కింద మృతి చెంది ఉండవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా హమాస్ వేట
ఇదిలా ఉండగా తాత్కాలిక కాల్పుల విరమణతో గాజాలో యుద్ధానికి తెరపడవచ్చని అందరూ ఆశించారు. అయితే కాల్పుల విరమణ గడువు ముగిసిన తర్వాత దాడులు యథాప్రకారం కొనసాగుతాయని, హమాస్‌ను అంతం చేయడమే దాడుల ప్రధాన లక్షమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో జరిపిన ఫోన్ సంభాషణలో సైతం తాను ఈ విషయం స్పష్టంగా చెప్పినట్లు ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హమాస్ అగ్రనేతలను గుర్తించే బాధ్యతను ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్‌కు అప్పగించినట్లు కూడా నెతన్యాహు చెప్పారు. ప్రధానంగా గల్ఫ్ దేశాలయిన లెబనాన్, ఖతర్‌లో హమాస్ నేతలు ఆశ్రయం పొందుతున్నట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి.

ఆస్పత్రి కింద టన్నెల్
మరో వైపు గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి అయిన అల్ షిఫాపై పట్టు సాధించిన ఇజ్రాయెల్ దళాలు.. దానికింద టన్నెల్ ఉన్న దృశ్యాలను వెలుగులోకి తీసుకువచ్చాయి.దీనిని హమాస్ మిలిటెంట్లు మిలిటరీ కార్యకలాపాల కోసం ఉపయోగిస్తున్నారని వెల్లడించింది. గురువారం ఇజ్రాయెల్ సైన్యం ట్విట్టర్‌లో టన్నెల్ దృశ్యాలను షేర్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News