Friday, May 24, 2024

సుపరిపాలనే లక్ష్యంగా వార్డు కార్యాలయాలు: మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జవాబుదారితనంతోకూడిన సుపరిపాలనే లక్షంగా వార్డు కార్యాలయాలకు శ్రీకారం చుట్టామని, ఈ వ్యవస్థ సమర్థవంతంగా పని చేయడానికి పార్టీలు, నాయకులు, రాజకీయాలకు అతీతంగాపని చేయాలని పురపాలక శాఖ మంత్రి కె.తారక రామరావు పిలుపునిచ్చారు. కాచిగూడలో శుక్రవారం కార్పొరేటర్ ఉమాదేవితో కలిసి మంత్రి కెటిర్ వార్డు కార్యాలయాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ వ్యక్తులు అశాశ్వతమని, వ్యవస్థ శాశ్వతమని, అందుకే పౌరులకు అత్యుత్తమ సేవలను అందించడమే ఉన్నత లక్షంగా దేశంలోనే మొట్ట మొదటిసారి గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో సరికొత్త పరిపాలన వ్యవస్థకు శ్రీకారం చుట్టామన్నారు.

ఇందులో భాగంగా నగరవ్యాప్తంగా 150 డివిజన్ లలో వార్డ్ కార్యాలయాలను ఏర్పాటు చేయగా, ఇందులో ఒకే రోజు 132 కార్యాలయాను ప్రారంభించుకున్నామని, మరో వారం రోజులో మిగిలిన 18 వార్డు కార్యాలయాలకు కూడ అందుబాటులోకి రానున్నయని మంత్రి వెల్లడించారు. ఎన్నో రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికి అదర్శవంతంగా నిలిచిందని, ఈ వ్యవస్థ కూడ విజయవంతం అయితే దేశం మొత్తం ఈ విధానాన్ని అన్ని నగరాల్లో అమలు చేసే అవకాశం ఉందని, తద్వారా దేశంలో సూపరిపాలన అందిస్తున్న నగరాలలో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలుస్తుందన్న నమ్మకం ఉందన్నారు. తెలిపారు. వార్డు కార్యాలయాల ఏర్పాటుతో నగర ప్రజలకు మరింత వేగంగా పౌర సేవలు అందడంతో పాటు ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు జిహెచ్‌ఎంసి అధికార యంత్రాంగానికి వీలు కలుగుతుందన్నారు. వార్డు స్థాయిలో కార్పొరేటర్లు ఉన్నారు కానీ అధికార యంత్రాంగం ప్రత్యేకంగా లేకపోవడం వల్ల ఈ వార్డు కార్యాలయ వ్యవస్థను తీసుకురావడం జరిగిందని తెలిపారు. స్ధానిక ప్రజా ప్రతినిధులు ఏ పార్టీకి చెందిన వారైనా వార్డు కార్యాలయానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాము. జిహెచ్‌ఎంసి అధికారులు కూడా ఎవరు ఫిర్యాదు చేసినా, ఈ వ్యవస్థ ద్వారా సత్వరం వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరుతున్నన్నారు.

వార్డు వ్యవస్థ సరికొత్త విధానం కావడంతో కొద్ది రోజులపాటు కొన్ని సమస్యలు ఉండే అవకాశం ఉందని, అయినా సాధ్యమైనంత వేగంగా ఈ వ్యవస్థను సంపూర్ణంగా పనిచేసేందుకు అందరూ కలిసి కట్టుగా కృషి చేయాలన్నారు. వార్డు కార్యాలయానికి అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ స్థాయి అధికారి పరిపాలన అధికారిగా ఉంటారని వారి పర్యవేక్షణలో వివిధ శాఖల నుంచి మొత్తం పదిమంది అధికారుల బృందం పని చేస్తారని చెప్పారు. ఇందులో రోడ్డు నిర్వహణ, పారిశుధ్యము, ఎంటమాలజీ, హరితహారం, టౌన్ ప్లానింగ్, విద్యుత్ శాఖ, జలమండలి, ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఇలా పదిమంది అధికారులు వార్డు స్థాయిలో జరిగే ఆయా శాఖల కార్యక్రమాలను పర్యవేక్షిస్తారని, జిహెచ్‌ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ కోరినట్లుగా భవిష్యత్తులో ఆరోగ్య శాఖ, పోలీస్ శాఖ తరపున కూడా మరింత మంది అధికారులను వార్డు కార్యాలయానికి అనుసంధానం చేయబోనున్నట్లు మంత్రి కెటిఆర్ వెల్లడించారు. కేవలం అధికారులను నియమించడమే కాకుండా, వారి విధుల నిర్వహణకు అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లను చేశామని, పౌరుల సమస్యల పరిష్కారానికి నిర్ణీతమైన గడుపుతో కూడిన సిటిజన్ చార్టర్ కూడా జిహెచ్‌ఎంసి ఈ వార్డు కార్యాలయం ద్వారా పౌరులకు అందిస్తుందని మంత్రి వెల్లడించారు.

అంతకు ముందు కాచిగూడ వార్డుకార్యాలయం పరిపాలన అధికారితో పాటు వివిధ విభాగాల అధికారులను వేదిక మీదకకు పిలిచిన మంత్రి కెటిఆర్ వారిని ప్రజలకు పరిచయం చేశారు. జిహెచ్‌ఎంసి లోకేష్ కుమార్ మాట్లాడుతూ పరిపాలన వికేంద్రీకరణలోభాగంగా జిహెచ్‌ఎంసిలో ప్రారంభించుకుంటున్న ఈ వార్డు కార్యాలయాల ద్వారా ప్రజల సమస్యలను పరిష్కారానికి అధికారులు కృషి చేస్తారని చెప్పారు. మున్సిపల్, రెవెన్యూ, ఆరోగ్య, పోలీసు, విద్యుత్ వ్యవస్థలకు సంబంధించి అధిక ఫిర్యాదులు ఉంటాయని, ఆరోగ్య శాఖ, పోలీసు శాఖలకు సంబంధించిన అధికారులను కూడ వార్డు కార్యాలయాల్లో ఏర్పాటు చేస్తే మరింత మెరుగైన సేవలను అందించిన వారమవుతామని మంత్రి కెటిఆర్‌ను కోరారు. జలమండలి ఎండి దాన కిశోర్ మాట్లాడుతూ వార్డు కార్యాలయాలను అందుబాటులోకి తీసుకురావడం విప్లవత్మాకమైన చర్యగా అభివర్ణించారు. ఇది నిజమైన ప్రజాస్వామ్యానికి నాంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశం, ఇవిడిఎం డైరెక్టర్ ఎన్. ప్రకాశ్‌రెడ్డి, జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News