Friday, May 24, 2024

గుండెలు పిండేసే ‘సూపర్ నోవా’ నరమేధం

- Advertisement -
- Advertisement -

జెరూసలెం: అప్పటి వరకు ఉల్లాసంగా సాగుతున్న ఓ మ్యూజిక్ ఫెస్టివల్‌లోకి ఆకాశంనుంచి రాకెట్లు దూసుకురావడం మొదలైంది. సంగీతాన్ని ఆస్వాదిస్తున్న అమాయక ప్రజలు ఆ ముప్పును గ్రహించలేకపోయారు. మరో వైపు డజన్ల కొద్దీ ముష్కరులు దూసుకువచ్చి కాల్పులు మొదలు పెట్టారు. దీంతో ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీశారు. కానీ నిష్క్రమణద్వారం చిన్నది కావడంతో ముష్కరులకు చిక్కి ప్రాణాలు కోల్పోయారు.అత్యవసర ద్వారాల వ్ద కూడా ముందుగానే ఉగ్రవాదులు నక్కి మరీ ప్రజలను చంపేశారు. ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన దాడుల్లో 700 మంది ఇజ్రాయెలీలు చనిపోగా, ఈ ఒక్క మ్యూజిక్ ఫెస్టివల్ ప్రాంగణంలోనే ఇప్పటివరకు 260 మృతదేహాలను గుర్తించారు. ఇజ్రాయెల్‌లో వ్యవసాయ పండుగ, ఈజిప్టునుంచి యూదులు వలసరావడాన్ని స్మరించుకునే సందర్భాలు కలిసి రావడంతో వరసగా సెలవులు వచ్చాయి. ఇవి ఏడు రోజులు ఉంటాయి.

ఈ సందర్భంగా ఇజ్రాయెల్ గాజా సరిహద్దు సమీపంలోనినెగెవ్ ఎడారిలో కిబ్బట్జ్ రీహ్ సమీపంలోఓ విశాల ప్రాంగణంలో ‘ ట్రైబ్ ఆఫ్ నోవా’ కంపెనీ ‘ది సూపర్ నోవా’ పేరిట ఓ మ్యూజిక్ ఫెస్టివల్‌ను ఏర్పాటు చేసింది. ఈ పార్టీకి సుమారు 3000 మంది హాజరయినట్లు కాన్ న్యూస్ వెల్లడించింది. శనివారం ఉదయం పార్టీ జోరుగా సాగుతున్న సమయంలో రాకెట్ల దాడి మొదలైంది. అయితే మ్యూజిక్ హోరులో వినిపించలేదు. అంతలోనే ఒక్కసారిగా ఎయిర్ డిఫెన్స్ సైరన్లు మోగసాగాయి.తర్వాత కరెంటు సరఫరా ఆగిపోయింది. కొన్ని నిమిషాల్లోనే పలు వ్యాన్లలో సుమారు 50 మంది సాయుధులు అక్కడికి వచ్చినట్లు ఓ బాధితురాలు చానల్ 12కు తెలిపింది. ఈ సమయంలో వీక్షకులపై తూటాల వర్షమే కురిసింది. ప్రజలు పారిపోవడానికి వీలు లేకపోవడంతో ఒక చోటికి వచ్చి ఆగిపోవలసిన పరిస్థితి ఎదురైంది. వాహనాల్లో ఎక్కి తప్పించుకోవడానికి చూసినా అవి ముందుకు కదిలే పరిస్థితి లేకపోవడంతో వాటిని వదిలి పరుగులు తీశారు.

ఏస్తెర్ బ్రోచోవ్ అనే మహిళ అయితే తాను ఎక్కిన వాహనంలోని వ్యక్తిని పాయింట్ బ్లాంక్ రేంజిలో హమాస్ ముష్కరులు కాల్చి చంపడంతో తాను కూడా చనిపోయినట్లు నటిస్తూ కదలకుండా అక్కడే పడిపోయింది. ముష్కరులు అక్కడినుంచి వెళ్లిపోయాక, ఇజ్రాయెల్ సైనికులు వచ్చి రక్షించేదాకా అలాగే ఉండిపోయింది. మరికొందరు చెటు,్ల పొదల చాటున దాక్కుని ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే మిలిటెంట్లు చెట్ల వద్దకు కూడా వచ్చి వెతికి మరీ కాల్చి చంపారు. దాదాపు మూడు గంటలతర్వాత ఇజ్రాయెల్ సైనికులు అక్కడికి చేరుకుని పలువురిని కాపాడారు. కాగా పార్టీలోని పలువురు విదేశీయులను ముష్కరులు దారుణంగా హత్య చేశారు. మరి కొందరిని బందీలుగా పట్టుకుని తీసుకెళ్లారు. వీరిలో కొందరు మహిళలు కూడా ఉన్నారు. చనిపోయిన వారిలో పిల్లలు, మహిళలు, వృద్ధులు, అంగవికలులు చాలా మంది ఉన్నారని, ఇది ఇజ్రాయెల్ చరిత్రలోనే అత్యంత దారుణమైన నరమేధంగా నిలిచిపోతుందని ప్రాణాలతో బైటపడిన వారంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News