Friday, May 24, 2024

సినిమా ఇండస్ట్రీకే ఓ మార్గదర్శకంగా..

- Advertisement -
- Advertisement -

Solo Brathuke So Better movie released

సాయిధరమ్ తేజ్, నభా నటేష్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘సోలో బతుకే సోబెటర్’. సుబ్బు దర్శకత్వంలో బివిఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా థాంక్స్ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శక నిర్మాత, నటుడు ఆర్.నారాయణమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ “కరోనా సమయంలో మానవజాతి అల్లకల్లోలమైంది. ముఖ్యంగా సినీ పరిశ్రమ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. వలస కార్మికుల్లాగా సినీ కార్మికుల భవిష్యత్తు కూడా ఏంటి? అని అందరూ ఆలోచించుకుంటున్న దశలో.. థియేటర్‌కు మళ్లీ ప్రేక్షకులు వస్తారు… సినిమాను ఆదరిస్తారనే నమ్మకంతో ముందుకు వచ్చిన ‘సోలో బ్రతుకే సోబెట’ టీంను అభినందిస్తున్నాను. ముఖ్యంగా ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్ థియేటర్స్ ఓపెన్ చేయడానికి అనుమతులు ఇవ్వడమే కాకుండా రాయితీలు కూడా ప్రకటించారు.

దీంతో చాలా ఆనందంగా ఉంది. సినిమాలో నా కటౌట్ పెట్టి దర్శకుడు సినిమాను నడిపించాడు”అని అన్నారు. డైరెక్టర్ సుబ్బు మాట్లాడుతూ “సాయితేజ్ ఓ సోదరుడిలా నాకు అండగా నిలబడి ఎంతగానో సపోర్ట్ చేశారు. అలాగే నభా నటేశ్ తన పెర్ఫామెన్స్‌తో క్యారెక్టర్‌లో ఇమిడిపోయారు. ఆర్.నారాయణమూర్తి ఇంటర్వ్యూని సినిమాలో వాడుకున్నాను. దీనికి ఆయన పెద్ద మనసుతో అంగీకరించారు. అందుకు ఆయనకు థాంక్స్‌”అని తెలిపారు. నిర్మాత బివిఎస్‌ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ “సినిమా సక్సెస్‌కు దోహదపడ్డ ప్రతి ఒక్కరికీ థాంక్స్. ఈ సినిమా రిలీజ్ అనేది ఇండియా సినిమా ఇండస్ట్రీకే ఓ మార్గదర్శకంగా నిలిచింది. జీ స్టూడియోస్, యువీ వంశీ, దిల్ రాజు సినిమాను రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను”అని అన్నారు. సాయితేజ్ మాట్లాడుతూ “ఓ ఆర్టిస్ట్‌కైనా, నిర్మాతకైనా, దర్శకుడికైనా థియేటర్ ఇచ్చే ఎనర్జీ వేరుగా ఉంటుంది. ఫస్ట్ టైమ్ డైరెక్టర్ తన పేరుని స్క్రీన్‌పై చూసుకుంటే ఉండే ఆనందం అంతా ఇంతా కాదు.

అలాంటి సమయంలో థియేటర్స్‌ను ఓపెన్ చేసుకోవచ్చునని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆదేశాలు ఇచ్చారు. అదే సమయంలో జీ స్టూడియో వాళ్లు కూడా సినిమాను చూసి దీన్ని థియేటర్స్‌లో విడుదల చేస్తే బావుంటుందని సపోర్ట్ చేశారు. ఈ సినిమా విజయం సాధించడంతో ఇండస్ట్రీలోని ప్రతి ఒక ఆర్టిస్ట్ ఫోన్ చేసి అభినందించారు… ట్వీట్స్ చేశారు. ఈ విజయంలో నేను భాగమైనందుకు ఎంతో గర్వంగా ఉంది”అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News